
పేకాటలో పట్టుబడిన కానిస్టేబుల్ సస్పెన్షన్
శాఖా నియమావళి ఉల్లంఘనపై పోలీస్ కమిషనర్ చర్య
సీకే న్యూస్ వేంసూర్ : పేకాట స్థావరంపై పోలీసులు నిర్వహించిన దాడిలో పట్టుబడిన ఏఆర్ కానిస్టేబుల్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ పోలీస్ కమిషనర్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో పాటు పోలీసు శాఖ నియమావళిని ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ నెల జూలై 19న ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం అమ్మపాలెం గ్రామ శివారు ప్రాంతంలో కంచర్ల వెంకటేశ్వరరావు అలియాస్ జయం, శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై వేంసూర్ ఎస్సై కవిత నేతృత్వంలోని పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 22 మందిని అదుపులోకి తీసుకుని, వారిపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేశారు.
పట్టుబడిన వారిలో సత్తుపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ (డ్రైవర్) మహమ్మద్ ఇమ్రాన్ షరీఫ్ కూడా ఉండటం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఒక పోలీసు సిబ్బంది సభ్యుడే చట్టవిరుద్ధమైన పేకాటలో పాల్గొనడం శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించే అంశంగా అధికారులు పరిగణించారు.
ఈ ఘటనపై సమగ్రంగా పరిశీలించిన అనంతరం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించడమే కాకుండా పోలీసు శాఖ క్రమశిక్షణా నియమాలను ఉల్లంఘించినందుకు కానిస్టేబుల్ మహమ్మద్ ఇమ్రాన్ షరీఫ్‌ను తక్షణ ప్రభావంతో సస్పెండ్ చేస్తూ ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఉత్తర్వులు జారీ చేశారు.
చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు సిబ్బందే చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, శాఖలో క్రమశిక్షణకు భంగం కలిగించే చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.




