
గడువు ముగిసిన సిరప్ ఇవ్వడంతో తండ్రి ఆగ్రహం
మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన..సిబ్బందితో వాగ్వాదం
మహబూబాబాద్, సి కే న్యూస్ : మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ చిన్నారికి గడువు ముగిసిన సిరప్‌ను అందించడంతో బాలుడి తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరానగర్ కాలనీకి చెందిన మురళీ తన నాలుగేళ్ల కుమారుడు ఎనోస్ రాజ్‌ను వాంతులు, విరోచనాలతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు చిన్నారిని పరీక్షించి రెండు రకాల సిరప్లు సూచించారు.
అందులో ఒక సిరప్‌ను ఆసుపత్రి ఫార్మసీ నుంచి అందజేయగా, మరో సిరప్‌ను బయట నుంచి కొనుగోలు చేయాలని సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆసుపత్రి నుంచి ఇచ్చిన సిరప్‌ను బాలుడికి వేయబోతుండగా, దాని గడువు 2026 జూన్ నెలలోనే ముగిసినట్లు తండ్రి గుర్తించాడు.
దీంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లి సిబ్బందిని నిలదీశాడు. ఈ సందర్భంగా సిబ్బందికి, బాలుడి తండ్రికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. “గడువు ముగిసిన మందు ఇస్తే పిల్లాడు చావాలా..?” అంటూ తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.




