
తొర్రూరులో ఎరువుల దుకాణాల తనిఖీలు
పారాక్వాట్ గడ్డి మందుల విక్రయిస్తే కఠిన చర్యలు: అధికారులు హెచ్చరిక
తొర్రూరు,సి కే న్యూస్ : పట్టణంలోని ఎరువులు, పురుగుమందుల విక్రయ దుకాణాల్లో వ్యవసాయ అధికారి (ఏఓ) రామ్ నర్సయ్య, ఎస్సై మహేందర్ రెడ్డి శుక్రవారం సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాల లైసెన్సులు, స్టాక్ రిజిస్టర్లు, మందుల నిల్వలు, విక్రయ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
నిషేధిత లేదా నిబంధనలకు విరుద్ధంగా పారాక్వాట్ (Paraquat) గడ్డి మందులను విక్రయించినట్లు గుర్తిస్తే సంబంధిత దుకాణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, రైతులకు అనుమతించబడిన నాణ్యమైన ఎరువులు, పురుగుమందులనే విక్రయించాలని సూచించారు. వ్యవసాయ రంగంలో నిబంధనల అమలుపై రాజీ ఉండదని, తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.




