
లైంగిక వేధింపులు కేసు.. ఐపీఎల్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్
Social media viral : భారత యువ క్రికెటర్ అభిషేక్ పోరెల్ ను లైంగిక వేధింపులు, బెదిరింపులు, మోసం చేసిన ఆరోపణలపై కోల్‌కతా పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, ఆ తర్వాత తనపై దాడి చేసి తీవ్రంగా వేధించాడని ఒక వైద్య విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ అరెస్ట్ చోటుచేసుకుంది.
ఈ క్రమంలో దాఖలైన పిటిషన్‌ను విచారించిన కలకత్తా హైకోర్టు, అభిషేక్ పోరెల్‌ను తక్షణమే అరెస్టు చేయాలని పోలీసు యంత్రాంగాన్ని గతంలో ఆదేశించిన విషయం తెలిసిందే. బాధితురాలు గత జూన్ నెలలోనే ఈ ఘటనపై పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తనపై జరిగిన అన్యాయం, ఎదురైన బెదిరింపులపై సదరు మెడికల్ స్టూడెంట్ ఉన్నతాధికారులను ఆశ్రయించింది.
కోర్టు కఠిన ఆదేశాలు జారీ చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు అభిషేక్ పోరెల్‌ను అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు. ఈ అరెస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, తదుపరి న్యాయపరమైన చర్యలపై పోలీసులు త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.




