
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్
ఆదిలాబాద్ జిల్లా, సీకే న్యూస్ ప్రతినిధి
నిరుద్యోగ యువతీ యువకులకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ.
కోచింగ్ లో పాల్గొనే ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
కోచింగ్ అర్హత పరీక్ష ఆగస్టు 20న డీటీసీ, ఆదిలాబాద్‌లో.
అర్హులైన అభ్యర్థులకు ఈనెల 24 నుండి ఉచిత కోచింగ్ ప్రారంభం.
పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో ఎస్సై, కానిస్టేబుల్ తదితర పోస్టులకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రాథమిక రాత పరీక్షకు ఉచిత కోచింగ్ అందించనున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు.
ఉచిత కోచింగ్‌లో పాల్గొనాలనుకునే అభ్యర్థులు పోస్టర్‌లోని క్యూఆర్ కోడ్ ద్వారా, లేదా లింక్,
https://docs.google.com/forms/d/e/1FAIpQLSeGAX-3uaNpI0odVBL5dEGsVGd9O1aV5XVOypGs-ryb9cgIwQ/viewform?usp=publish-editor
పైనా ఇచ్చిన లింక్ ద్వారా లేదా సమీప పోలీస్ స్టేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 20న ఉదయం 11 గంటలకి డీటీసీ, ఆదిలాబాద్ (జిల్లా జైలు పక్కన) కోచింగ్ అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను ఎంపిక చేసి, స్థానిక ఆదిలాబాద్ డిటిసి (డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్) లో ఈనెల 24వ తారీఖు నుండి నిష్ణాతులైన ప్రైవేటు అధ్యాపకులచే కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు కావలసిన అన్ని అంశాలలో ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. శిక్షణతో పాటు అభ్యర్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్, నిపుణులచే మార్గదర్శకత్వం, రాత పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
నోటిఫికేషన్‌లోని ముఖ్యమైన ఖాళీలు
బాసర జోన్ పరిధిలో ఎస్సై పోస్టులు:
సివిల్ – 29, ఏఆర్ – 2, ఫైర్ – 5, టీజీఎస్పీ – 1, డిప్యూటీ జైలర్ (పురుషులు) – 1.
ఆదిలాబాద్ జిల్లా పరిధిలో కానిస్టేబుల్ పోస్టులు:
సివిల్ కానిస్టేబుల్స్ – 130, ఏఆర్ కానిస్టేబుల్స్ – 56, ఫైర్ కానిస్టేబుల్స్ – 12, జైల్ వార్డెన్ (పురుషులు) – 4. రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోస్టులను కూడా నోటిఫికేషన్లో పొందుపరిచినట్లు తెలిపారు.
పోలీసు శాఖలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న యువతీ యువకులు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అందిస్తున్న ఈ ఉచిత కోచింగ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. క్రమశిక్షణతో చదువుతూ, పట్టుదలతో శిక్షణను కొనసాగిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.
ముఖ్యంగా ఈ కోచింగ్ నందు శిక్షణ తీసుకొని ప్రాథమిక పరీక్ష లో ఉత్తీర్ణత పొంది, మెయిన్స్ కి అర్హత సాధించిన అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయంతో కూడిన శిక్షణ సైతం అందించబడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు పి. మౌనిక ఐపీఎస్, బి. సురేందర్ రావు, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్, డీఎస్పీలు ఎల్. జీవన్ రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




