
మేడారం వెళ్తున్న కుటుంబాన్ని కాటేసిన మృత్యువు.. అదుపుతప్పిన కారు..
Web desc : ఆనందంగా మేడారం వెళ్తున్న ఓ కుటుంబంలో అనుకోని విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం రూపంలో ఇంటి పెద్దను బలితీసుకున్న దారుణ ఘటన వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో బుధవారం ఉదయం జరిగింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మల్లన్నగూడెం గ్రామానికి చెందిన గణేష్ (40) తన భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి మొత్తం ఆరుగురు కిరాయి కారులో మేడారానికి బయలుదేరారు.
రాజుపేట గ్రామం దాటి ముత్తోజిపేటకు చేరుకునే సరికి కారు అదుపుతప్పినట్లు తెలుస్తోంది. వేగంగా పక్కనే ఉన్న ఓ ఇంటివైపు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కుటుంబ పెద్ద గణేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
గణేష్ తల్లికి చేయి విరగ్గా, తండ్రి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గణేష్ భార్య, ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. కారు వేగంగా ఢీకొనడంతో అక్కడ ఉన్న ఓ ఎద్దు ఎగిరిపడినట్లు సమాచారం. ప్రమాద ధాటికి కారు బంపర్, నంబర్ ప్లేట్‌తో పాటు ఇతర భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి.
అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.




