Khammam
Trending

మీకు లక్ష వస్తోంది.. మాకు ఎంత ఇస్తారు

మీకు లక్ష వస్తోంది.. మాకు ఎంత ఇస్తారు

పేరు మార్పిడికి.. పెళ్లి సర్టిఫికెట్‌కు ముడుపులే!

మీకు లక్ష వస్తోంది.. మాకు ఎంత ఇస్తారు

పంచాయతీ కార్యాలయాల్లో సేవలకు ‘రేట్లు’ నిర్ణయించారా?

కార్యదర్శులు, మల్టీపర్పస్‌ వర్కర్ల తీరుపై ప్రజల్లో ఆగ్రహం

సీకే న్యూస్‌ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్‌ నరసింహ ఆగస్టు 18 2026: గ్రామ పంచాయతీల్లో ప్రజలకు అందాల్సిన సేవల పేరుతో అదనపు వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఆస్తుల మ్యూటేషన్‌ (పేరు మార్పిడి) కోసం రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు, కళ్యాణలక్ష్మి పథకానికి అవసరమైన మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ కోసం కూడా ఇదే స్థాయిలో డబ్బులు అడుగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో కొందరు పంచాయతీ కార్యదర్శులు, మల్టీపర్పస్‌ వర్కర్లు లబ్ధిదారులను డబ్బులు అడుగుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

మ్యూటేషన్‌కు రూ.2 వేల నుంచి రూ.3 వేలా?

వారసత్వంగా వచ్చిన ఆస్తిని తమ పేరుపైకి మార్చుకోవడం, కొనుగోలు చేసిన ఇల్లు లేదా స్థలాన్ని పాత యజమాని పేరు నుంచి కొత్త యజమాని పేరుపైకి మార్చుకోవడం వంటి మ్యూటేషన్‌ ప్రక్రియ కోసం పంచాయతీని ఆశ్రయించే ప్రజల నుంచి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు డబ్బులు అడుగుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దరఖాస్తు ప్రక్రియ, రికార్డుల పరిశీలన, పేరు మార్పిడి వంటి పనుల పేరుతో అదనపు మొత్తాలు తీసుకుంటున్నారని పలువురు చెబుతున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మ్యూటేషన్‌కు నిర్ణీత రుసుము ఏమైనా ఉంటే అది ఎంత? అదనంగా వసూలు చేస్తున్న మొత్తాలకు రసీదులు ఎందుకు ఇవ్వడం లేదనే ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి.
మ్యారేజ్‌ సర్టిఫికెట్‌కూ డబ్బుల డిమాండ్‌?
కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందేందుకు మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ అవసరం కావడంతో పంచాయతీ కార్యాలయాలను ఆశ్రయించే లబ్ధిదారుల నుంచి కూడా రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో కొందరు కార్యదర్శులు, మల్టీపర్పస్‌ వర్కర్లు డబ్బులు అడుగుతున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నట్లు సమాచారం.
పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందాల్సిన పేద కుటుంబాలు సర్టిఫికెట్‌ కోసం కూడా అదనపు మొత్తాలు చెల్లించాల్సి వస్తే ప్రభుత్వ పథకాల ఉద్దేశమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మీకు లక్ష రూపాయలు వస్తున్నాయి..

కొందరు పంచాయతీ కార్యదర్శులు, మల్టీపర్పస్‌ వర్కర్లు కళ్యాణలక్ష్మి లబ్ధిదారులతో మాట్లాడుతూ “మీకు లక్ష రూపాయలు వస్తున్నాయి కదా.. మాకు కూడా కొంత సాయం చేయండి” అంటూ డబ్బులు అడుగుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ పథకం కింద వచ్చే ఆర్థిక సహాయాన్ని సాకుగా చూపి లబ్ధిదారుల నుంచి డబ్బులు అడగడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు.

అధికారిక రుసుము ఎంత?

మ్యూటేషన్‌, మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ వంటి సేవలకు ప్రభుత్వం నిర్ణయించిన రుసుములు ఉంటే వాటిని పంచాయతీ కార్యాలయంలో స్పష్టంగా ప్రదర్శించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలు చెల్లించే ప్రతి మొత్తానికి అధికారిక రసీదు ఇవ్వాలని, రసీదు లేకుండా అదనపు మొత్తాలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలి

మ్యూటేషన్‌, మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ పేరుతో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న వసూళ్లపై మండల, జిల్లా స్థాయి అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కార్యదర్శులు, మల్టీపర్పస్‌ వర్కర్లు లబ్ధిదారుల నుంచి డబ్బులు అడుగుతున్నారన్న ఆరోపణలపై వాస్తవాలను నిగ్గుతేల్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆరోపణలు నిజమని విచారణలో తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా వసూలు చేసిన మొత్తాలను తిరిగి ఇప్పించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందే ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా సేవలు అందేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button