KhammamPoliticalTelangana

కొనిజర్లలో 57 ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం

కొనిజర్లలో 57 ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం

కొనిజర్లలో 57 ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం

2,900 మంది విద్యార్థులకు వారంలో ఆరు రోజులు అల్పాహారం

సీకే న్యూస్‌ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఇస్లావత్‌ నరసింహ ఆగస్టు 24 2026: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, చదువుపై ఏకాగ్రతను పెంపొందించే లక్ష్యంతో అమలు చేస్తున్న అల్పాహార పథకం కొనిజర్ల మండలంలో నేటి నుంచి ప్రారంభమైంది. హరే రామ హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఈ పథకాన్ని మండలంలోని 57 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించారు.

కొనిజర్ల మండలంలో కూడా అల్పాహార పథకాన్ని అమలు చేయాలని వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశారు. ఈ విజ్ఞప్తిపై జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. సానుకూలంగా స్పందించి, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ద్వారా అవసరమైన అనుమతులు తీసుకుని పథకాన్ని మండలంలో అమలు చేయడానికి చర్యలు చేపట్టారు.

దీంతో ఆగస్టు 24వ తేదీ సోమవారం నుంచి కొనిజర్ల మండలంలోని మొత్తం 57 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం అందించడం ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా 8 హైస్కూల్స్, 4 యూపీఎస్ పాఠశాలలు, 45 ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న సుమారు 2,900 మంది విద్యార్థులకు వారంలో ఆరు రోజుల పాటు అల్పాహారం అందనుంది. ఈ కార్యక్రమం 249 మంది ఉపాధ్యాయుల సమక్షంలో కొనసాగనుంది.

పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఉదయం వేళల్లో పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించడం వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు తరగతి గదిలో చదువుపై మరింత ఏకాగ్రత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.

కొనిజర్ల మండలానికి అల్పాహార పథకాన్ని మంజూరు చేసి అమలు చేయడానికి సహకరించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్.లకు టీపీసీసీ సభ్యులు వడ్డే నారాయణరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button