
72,000 మందికి పీ ఆర్ సీ కట్?
కమిటీకి పంపిన ఉద్యోగుల సంఖ్యలో కోతపెట్టిన సర్కార్
జాబితాలో 72 వేల మంది ఎంప్లాయీస్ కు దక్కని చోటు
డీఎస్సీ-2024 టీచర్లు, గ్రూప్స్, పోలీస్, గురుకుల ఉద్యోగుల్లో టెన్షన్
30 శాతానికి పైగా ఫిట్ మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాల డిమాండ్
కొత్త పీ ఆర్ సీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో రాష్ట్రంలోని కొందరు ఉద్యోగులకు సర్కార్ షాక్ ఇచ్చింది. ఏకంగా 70 వేల మంది ఉద్యోగులకు పీ ఆర్ సీ కోత పెట్టనున్నది. పీ ఆర్ సీ కమిటీకి సర్కార్ పంపించిన ఉద్యోగుల సంఖ్యలో ఈ 70 వేల మందిని మినహాయించినట్టు సమాచారం. వీరంతా 2004 తర్వాత నియమితులైన వారే కావడం గమనార్హం. దీంతో ఈ 70 వేల మందికి కొత్త వేతన సవరణ వర్తించడం అనుమానంగానే కనిపిస్తున్నది. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇస్తున్న రెండో పీ ఆర్ సీ పై ఆశలు పెట్టుకున్న ఉద్యోగుల్లో కొత్త టెన్షన్ నెలకొన్నది. తెలంగాణ పీ ఆర్ సీ నివేదిక రూపకల్పన తుది దశకు చేరుకున్నది.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ నెల 16వ తేదీలోపు ఈ నివేదికను ప్రభు త్వానికి సమర్పించే అవకాశాలు కనిపిస్తు న్నాయి. ఈ నివేదికలో రాష్ట్రంలోని ఉద్యో గులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతమంది ఉన్నారన్న వివరాలను ప్రభుత్వం పీ ఆర్ సీ కమి టీకి సమర్పించింది. ప్రస్తుత మాస్టర్ స్కేళ్లు, కమిటీ సిఫార్సు చేసే ఫిట్ మెంట్ వివరాలు న్నాయి. అయితే ఇందులో ఈ 70వేల మంది ఉద్యోగుల వివరాలు లేవని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
మిస్సింగ్ జాబితాలో టీచర్లు, కానిస్టేబుళ్లు అధికం
పీ ఆర్ సీ వర్తించని 70వేల మందిలో టీచర్లు, గురుకుల ఉపాధ్యాయులు, కానిస్టేబుళ్లే అధికంగా ఉన్నారు. ఇందులో డీఎస్సీ- 2024కు చెందిన 10 వేల మంది టీచర్లతోపాటు గురుకుల టీచర్లే ఎక్కువగా ఉన్నారు. వీరితోపాటు గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగులు, వైద్య సిబ్బంది, గురుకుల టీచర్లు, పోలీసు కానిస్టేబుళ్లు, జూనియర్, పాలిటెక్నిక్ లెక్చరర్లు కూడా ఉన్నారు. ఉద్యోగుల జాబితాలో వీరి సంఖ్యను ప్రస్తావించకపోవడంతో వీరికి కొత్త పీ ఆర్ సీ వర్తింపుపై అనిశ్చితి నెలకొన్నది. పీ ఆర్ సీ కమిటీకి ప్రస్తుత ఉద్యోగులే కాకుండా రిటైరైన వారి వివరాలను సైతం సర్కార్ సమర్పించింది. ఇటీవలి కాలంలో రిటైరైన వారిని పెన్షనర్ల జాబితాలో చూపించి నట్టు సమాచారం.
ఫిట్ మెంట్ పై చర్చోపచర్చలు
పీ ఆర్ సీ కమిటీ సిఫార్సు చేసే ఫిట్ మెంట్ పై ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది.ఏ నలు గురు కలిసినా ఫిట్ మెంట్ ఎంతన్న అంశం పైనే చర్చించుకుంటున్నారు. గత పీ ఆర్ సీ ల్లో కమిటీ సిఫార్సుల కంటే ప్రభుత్వం ఎక్కువ ఫిట్ మెంట్ ఇచ్చిన సందర్భాలున్నాయి. ఉదాహరణకు ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన పీకే అగర్వాల్ కమిటీ 27% ఫిట్ మెంట్ ను సిఫార్సు చేస్తే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ 43% ఫిట్ మెంట్ మంజూరుచేసింది.
తెలంగాణ తొలి వేతన సవరణ కమిషన్ 2020లో 7.5% ఫిట్ మెంట్ ను మాత్రమే సిఫార్సు చేసింది. అయితే, 2021లో కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు 80% ఫిట్ మెంట్ ఇచ్చింది. ప్రస్తుత పీ ఆర్ సీ లో కూడా కమిషన్ సిఫార్సు చేసే ఫిట్ మెంట్ ఫైనల్ కాదని.. ప్రభుత్వం, ఉద్యోగ జేఏసీల మధ్య చర్చలు జరిగిన తర్వాత ఫిట్ మెంట్ శాతం పెరిగే అవకాశాలే ఎక్కువున్నాయన్న చర్చ ఉద్యోగుల్లో నడుస్తున్నది.
80% మించితేనే లాభం
పీ ఆర్ సీ కమిటీ ఎంత సిఫార్సు చేసినా 30 శాతానికి మించి ఫిట్ మెంట్ వర్తింపజేస్తేనే లాభమని ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. ఈసారి కమిటీ 10% కంటే తక్కువ ఫిట్ మెంట్ సిఫార్సు చేసే అవకాశాలున్నాయని ఉద్యోగుల్లో చర్చ నడుస్తున్నది. ఇది ఆమోదయోగ్యంకాదని, 30 శాతానికి పెంచాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. రూ.40వేల బేసిక్ పే గల ఉద్యోగికి 30% ఫిట్ మెంట్ తో రూ.12వేల మేరకు మాత్రమే పెరుగుతుం దని, పెరిగిన మార్కెట్ ధరలతో పోల్చితే ఇది దేనికీ సరిపోదని వాదిస్తున్నారు. నిత్యావసర ధరలు, జీవన వ్యయంతో పోల్చితే తక్కువ ఫిట్ మెంట్ వల్ల వాస్తవంగా చేతికందే మొత్తం తగ్గుతుందని అంటున్నారు.
70వేల మందికి న్యాయం చేయాలి: రావుల రామ్ మోహన్ రెడ్డి
రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ సమాన న్యాయం చేయాలని తెలంగాణ డీఎడ్, బీఎడ్ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం ప్రతినిధి రావుల రామ్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. పీ ఆర్ సీ కమిటీ 70వేల మంది కొత్త ఉద్యోగులకు న్యాయం జరిగేలా సిఫార్సు చేయాలని కోరారు. టీచర్లు, పోలీసు, గ్రూప్స్ ఉద్యోగులందరికీ పూర్తిస్థాయి ఫిట్ మెంట్ అందేలా కమిటీ నివేదిక సమర్పించాలని విజ్ఞప్తి చేశారు.




