
పేరుకే పేదలకు ఉపాధి హామీ పథకం,
డిమాండ్ తో కూలీలకు గండి,
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఉపాధి హామీ పథకం,
ప్రజలకు చేదు అనుభూతి
శనివారం డిమాండ్ లేకపోతే సోమవారం పని లేదు,
(సీ కే న్యూస్) చేగుంట/
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రజలకు చేదు అనుభూతిని మిగులుస్తోంది.
పాత ఉపాధి హామీ పథకంలో కూలీ పని అడిగితే పని కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా ఉండేది. కానీ కొత్త విధానంలో ప్రతి శనివారం ముందస్తుగా డిమాండ్ నోటీసు చేసుకుంటేనే సోమవారం నుంచి పనికి అర్హులు అవుతున్నారు.
శనివారం డిమాండ్‌లో పేరు నమోదు చేయించుకోని కూలీలు ఆ వారం మొత్తం పని కోల్పోతున్నారు. మళ్లీ వచ్చే శనివారం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
రోజువారీ కూలీ పనులు చేసుకునే పేద ప్రజలు వారం ముందే పనికి వస్తామని చెప్పలేకపోతున్నారు. దీంతో చాలామంది ఉపాధి పనులకు దూరమవుతున్నారు.
అంతేకాకుండా ఎన్‌ఎంఎంఎస్ యాప్‌లో ఉదయం, మధ్యాహ్నం రెండుసార్లు ఫొటో హాజరు తప్పనిసరి కావడం, సర్వర్ సమస్యలు, పనుల్లో 60 రోజుల విరామం కూలీలను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగితాలపై పని దినాలు 100 నుంచి 125 రోజులకు పెరిగినా, ఆచరణలో మాత్రం పని దొరకడం కష్టంగా మారిందని కూలీలు వాపోతున్నారు.
ప్రభుత్వం ఈ నిబంధనలను సడలించి, పాత విధానంలో మాదిరిగా పని అడిగిన వెంటనే పని కల్పించాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు.




