KhammamPoliticalTelangana

కూలీల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవు

కూలీల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవు

కూలీల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవు

ఆటో డ్రైవర్లకు ఎస్సై సంధ్య హెచ్చరిక.. రోడ్డు భద్రతపై అవగాహన

సీకే న్యూస్‌ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ నవంబర్ 17 2026: వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలను ఆటోల్లో పరిమితికి మించి తరలిస్తూ వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని ఏన్కూరు ఎస్సై సంధ్య ఆటో డ్రైవర్లను హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆటోల్లో అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకుని ప్రమాదాలకు కారణమైతే ఉపేక్షించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో పోలీసు సిబ్బందితో కలిసి ఆమె వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ పనుల నిమిత్తం కూలీలను తరలిస్తున్న ఆటోలను ఆపి డ్రైవర్లకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు. ఆటో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల వాహనంపై నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వివరించారు. చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

అనంతరం ఆటోల్లో ప్రయాణిస్తున్న కూలీలతోనూ ఎస్సై మాట్లాడారు. పనులకు త్వరగా చేరుకోవాలనే తొందరలో ఆటోల్లో కిక్కిరిసి ప్రయాణించి ప్రాణాలను పణంగా పెట్టవద్దని సూచించారు.

డ్రైవర్లు కూడా కూలీలను ఆదాయ వనరుగా కాకుండా తమ బాధ్యతగా భావించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని పేర్కొన్నారు. రహదారి భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రమాదాల నివారణకు పోలీసులు సూచించిన మార్గదర్శకాలను అనుసరించాలని ఎస్సై సంధ్య కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button