KhammamPoliticalTelangana

ఆర్గానిక్ సాగులో అదరహో.. జీవీఆర్

ఆర్గానిక్ సాగులో అదరహో.. జీవీఆర్

ఆర్గానిక్ సాగులో అదరహో.. జీవీఆర్

రసాయనాలు లేకుండానే నాణ్యమైన వరి దిగుబడి..

ఆర్గానిక్ సాగుతో ఆదర్శంగా నిలుస్తున్న జీవీఆర్

కంకినిండా గింజలు.. పంట నాణ్యతపై వ్యవసాయ అధికారుల ప్రశంసలు

సీకే న్యూస్‌ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు నవంబర్ 17 2026:రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం లేకుండానే ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో వరి సాగు చేస్తూ ఆరికాయలపాడు గ్రామ మాజీ ఉపసర్పంచ్ గుడ్ల వెంకటేశ్వరరావు (జీవీఆర్) ఆదర్శంగా నిలుస్తున్నారు.

సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ ఆయన సాగు చేసిన వరి పంట ప్రస్తుతం ఏపుగా పెరిగి, కంకుల నిండా గింజలతో కళకళలాడుతోంది. మంగళవారం మండల వ్యవసాయ అధికారి అవుకు నరసింహారావు, వ్యవసాయ విస్తరణ అధికారి సైదులు పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించకుండానే పంట ఆరోగ్యకరంగా పెరగడం అభినందనీయమన్నారు. వరి కంకులు గింజలతో నిండుగా ఉండటంతో పాటు తాలు గింజలు కనిపించకపోవడం పంట నాణ్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. సమీపంలోని ఇతర వరి పొలాలతో పోలిస్తే కంకుల సంఖ్య అధికంగా ఉండటం, గింజల నాణ్యత బాగుండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రైతు జీవీఆర్ తన సాగు విధానాలను వివరిస్తూ.. వరి నాటిన 25 రోజుల తర్వాత కలుపు నివారణ కోసం రసాయన మందులు వినియోగించకుండా నూకలు చల్లినట్లు తెలిపారు. దీంతో కలుపు పెరుగుదల తగ్గడంతో పాటు వరి మొక్కలు ఏపుగా పెరిగాయని చెప్పారు. అక్కడక్కడా మిగిలిన కలుపును కూలీలతో తొలగించినట్లు వివరించారు.

రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా వేపపిండి, వానపాముల ఎరువును రెండుసార్లు వినియోగించినట్లు తెలిపారు. చీడపీడల నివారణకు వేపనూనె, ఆవు మూత్రం, ఆవుపేడతో తయారు చేసిన జీవామృతాన్ని పిచికారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ విధానాల వల్ల భూసారం పెరగడంతో పాటు నేల గుల్లబారి, మొక్కలు దృఢంగా పెరిగాయని వివరించారు.

అనంతరం వ్యవసాయ అధికారి నరసింహారావు మాట్లాడుతూ రైతులు తమకున్న వ్యవసాయ భూమిలో కొంత భాగాన్నైనా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. రసాయన రహిత ఆహార ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతి సిద్ధమైన సాగు విధానాలపై రైతులు అవగాహన పెంచుకోవాలని, జీవీఆర్ అనుసరిస్తున్న ఆర్గానిక్ సాగు విధానం ఇతర రైతులకు స్ఫూర్తిదాయకమని అభినందించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో) సైదులు, రైతులు వల్లభనేని వేణుమాధవ్, వడ్లమూడి రమేష్‌బాబు, కట్ట ఖాదర్‌బాబు, గంజి అనంతరాములు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button