
సుబ్లేడు పీహెచ్‌సీలో సిబ్బంది నిర్లక్ష్యం.. రోగుల అవస్థలు!
సికె న్యూస్ ప్రతినిధి
తిరుమలాయపాలెం: సుబ్లేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మధ్యాహ్నం నుంచి స్టాఫ్ నర్స్ మినహా ఇతర సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో వైద్యం కోసం వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
షుగర్ పరీక్ష కోసం ఇప్పటికే మూడుసార్లు ఆసుపత్రికి వచ్చినా సిబ్బంది అందుబాటులో లేరని ఓ రోగి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ సిబ్బంది లేకపోవడంతో వైద్య సేవలు అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆన్‌లైన్ హాజరు విధానం అమల్లో ఉన్నప్పటికీ సిబ్బంది తమ ఇష్టానుసారంగా విధులకు గైర్హాజరవుతుండటంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది.
నిజంగానే ఆన్‌లైన్ హాజరు వ్యవస్థ పనిచేస్తోందా? పనిచేస్తే సిబ్బంది విధుల నుంచి ఎలా వెళ్లిపోతున్నారు? హాజరు నమోదుకే పరిమితమైందా? హాజరు ఆధారంగానే వేతనాలు చెల్లిస్తున్నారా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ పలు వివాదాలతో వార్తల్లో నిలిచిన సుబ్లేడు పీహెచ్‌సీపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రోగులు ప్రశ్నిస్తున్నారు.




