KhammamPoliticalTelangana

అత్తకు తలకొరివి పెట్టిన కోడలు.. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం

అత్తకు తలకొరివి పెట్టిన కోడలు.. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం

అత్తకు తలకొరివి పెట్టిన కోడలు.. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం

కుమారుడి స్థానంలో నిలిచి అంత్యక్రియలు నిర్వహించిన కోడలు.. జన్నారంలో అందరి ప్రశంసలు

సీకే న్యూస్‌ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు నవంబర్ 24 2026: సాధారణంగా కుటుంబంలో పెద్దలు మరణిస్తే కుమారులు లేదా ఇతర కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించడం సంప్రదాయం. అయితే రక్తసంబంధం కంటే మానవత్వం, ఆప్యాయత, బాధ్యత గొప్పవని నిరూపించారు ఏన్కూరు మండలం జన్నారం గ్రామానికి చెందిన గోంగూర కౌసల్య. కన్నతల్లిలా చూసుకున్న అత్త మరణించడంతో కుమారుడి స్థానంలో నిలిచి స్వయంగా తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

జన్నారం గ్రామానికి చెందిన గోంగూర సావిత్రమ్మ (80) వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం సాయంత్రం మృతి చెందారు. మంగళవారం ఉదయం నిర్వహించిన అంత్యక్రియల్లో ఆమె కోడలు కౌసల్య స్వయంగా ముందుకు వచ్చి తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.

సావిత్రమ్మ భర్త నారాయణ చాలా సంవత్సరాల క్రితమే మృతి చెందగా, వారికి వెంకటేశ్వర్లు అనే ఒక్కగానొక్క కుమారుడు ఉండేవాడు. అయితే 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటేశ్వర్లు మృతి చెందడంతో కుటుంబానికి తీరని లోటు ఏర్పడింది.

అప్పటి నుంచి కౌసల్యనే అత్తకు తోడుగా ఉంటూ, ఆమెకు అవసరమైన సేవలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకున్నారు. సావిత్రమ్మకు ఇద్దరు మనవరాళ్లు, ఒక మనవడు ఉన్నారు. అయితే మనవడి భార్య గర్భవతిగా ఉండటంతో కుటుంబ సంప్రదాయం ప్రకారం అతను అంత్యక్రియల్లో తలకొరివి పెట్టలేని పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో ఎలాంటి సంకోచం లేకుండా కౌసల్య ముందుకొచ్చి కుమారుడి స్థానంలో నిలబడి అత్తకు అంత్యక్రియలు నిర్వహించారు. అత్త పట్ల ఆమె చూపిన ప్రేమ, ఆప్యాయత, చివరి వరకు నిర్వర్తించిన కుటుంబ బాధ్యత గ్రామస్తులను కదిలించాయి.

కన్నతల్లి కాకపోయినా తల్లిగా ఆదరించిన అత్తకు, కన్నకూతురిలా సేవలందించి చివరి వీడ్కోలు పలికిన కోడలు కౌసల్యను గ్రామస్తులు, బంధువులు అభినందిస్తున్నారు. బంధాలకు రక్తసంబంధమే ప్రామాణికం కాదని, ప్రేమాభిమానాలు, మానవత్వమే అసలైన బంధమని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button