ముస్లిం సోదరులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
ముస్లిం సోదరులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం;
గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారి ఖాతాల్లో నగదు జమ
రంజాన్ మాసం త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ముస్లిం సోదరులు, తమ ప్రార్థనా మందిరాలను ముస్తాబు చేసే పనిలో నిమగ్నమయ్యారు. పవిత్రమైన ఉపవాసాలను సైతం ముస్లింలు ఈ మాసంలో ఆచరిస్తారు.
అయితే రంజాన్ మాసం ప్రారంభం ముందుగానే ముస్లిం సోదరులకు ప్రభుత్వం భారీ కానుక ప్రకటించింది.
రాష్ట్రంలోని ముస్లింల ప్రార్ధన మందిరాలైన మసీదులలో ఇమామ్, మౌజన్ లు ప్రార్థనలు నిర్వహిస్తారు. వీరికి గౌరవ వేతనాలను అందించే ప్రక్రియకు గతంలోనే శ్రీకారం చుట్టారు. తాజాగా ఏపీ ప్రభుత్వం వీరికి అందించే పెండింగ్ గౌరవ వేతనాలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ప్రకటన చేయడమే కాదు.. నిధులను కూడా విడుదల చేయడం విశేషం.
మసీదులలో చాలీచాలని వేతనాలు పొందుతూ ఇమామ్, మౌజన్ లు విధులు నిర్వహిస్తారు. వీరికి అండగా నిలిచేందుకు గౌరవ వేతనాలను ప్రభుత్వం అందిస్తుంది. దేవాలయాలకు ధూప దీప నైవేద్యాల ఖర్చుల నిమిత్తం నిధులు విడుదల చేసినట్లుగానే, ముస్లింల ప్రార్ధన మందిరాలైన మసీదులకు సైతం ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. కాగా 2024 ఏప్రిల్ నుండి వీరికి అందించే గౌరవ వేతనాలు అందని పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, తమ ప్రభుత్వం కూడా ఇమామ్, మౌజన్ లకు గౌరవ వేతనాలు అందించే ప్రక్రియను కొనసాగిస్తుందని ప్రకటించింది. అసలే రంజాన్ మాసం వస్తున్న సందర్భంగా పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనాలను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఏప్రిల్ 2024 నుండి మార్చి 2025 వరకు మొత్తం రూ. 45 కోట్లల్లో వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. వీటిపై దృష్టి సారించిన ప్రభుత్వం, పెండింగ్ వేతనాల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనితో ఇమామ్ లకు నెలకు రూ. 10 వేల చొప్పున, మౌజన్ లకు రూ. 5 వేల చొప్పున వేతనాలు విడుదలయ్యాయని చెప్పవచ్చు. ప్రభుత్వం పెండింగ్ వేతనాలు మంజూరు చేయడంపై ముస్లిం సోదరులు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పాలన సాగిస్తుందని మంత్రి మహమ్మద్ ఫరూఖ్ అన్నారు.
కాగా మార్చి 2 నుండి 30 వ తేదీ వరకు రంజాన్ మాసం సంధర్భంగా ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు ఒక గంట సమయం వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది. ముస్లింలు ఉపవాసం ఆచరిస్తారు కావున ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులను కూడా విడుదల చేసింది. రంజాన్ మాసంలో ఉపవాసాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయమని ముస్లిం సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.