దరఖాస్తుదారుడి పై రెవెన్యూ ఇన్స్పెక్టర్ దాడి..?

దరఖాస్తుదారుడి పై రెవెన్యూ ఇన్స్పెక్టర్ దాడి..?;

By :  Ck News Tv
Update: 2025-03-30 13:08 GMT

దరఖాస్తుదారుడి పై రెవెన్యూ ఇన్స్పెక్టర్ దాడి..?

నిరుద్యోగుల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే రాజీవ్ యువ వికాస్ పథకం దరఖాస్తుదారునికి దమ్మపేట రెవెన్యూ కార్యాలయంలో చేదు అనుభవం ఎదురైంది.

బాధిత యువకుడు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లచ్చాపురం గ్రామానికి చెందిన భూక్యా నాగేంద్రబాబు రాజీవ్ యువ వికాస్ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా ఆదాయ సర్టిఫికెట్ కోసం ఇటీవల మీసేవ ద్వారా అప్లై చేసి రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తును అందజేశాడు.

రోజులు గడుస్తున్నప్పటికీ ఆదాయ సర్టిఫికెట్ రాకపోవడంతో శనివారం నాగేంద్రరావు రెవెన్యూ కార్యాలయానికి వచ్చి రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీరస్వామిని ఆదాయ సర్టిఫికెట్ గురించి అడిగానని, దానికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ తన దగ్గర నుంచి లంచం డిమాండ్ చేశాడని, తాను లంచం ఎందుకు ఇవ్వాలని అడిగినందుకు తన కులం పేరుతో దూషించి, తనపై దాడి చేశాడని నాగేంద్రరావు మీడియా ముందు వాపోయాడు.

తనపై దాడి చేసిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ను ఉన్నతాధికారులు వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాడు.

ఇదే విషయంపై మీడియా ప్రతినిధులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీరాస్వామిని ప్రశ్నించగా నాగేందర్రావు భార్య ప్రభుత్వ ఉద్యోగి అని, అందుకు గాను తాను ఆదాయ సర్టిఫికెట్ ఇవ్వడానికి తన భార్య శాలరీ సర్టిఫికెట్ తీసుకురమ్మని చెప్పానని , దీంతో నాగేందర్రావు తనపై దుర్భాషలాడుతూ, అసభ్య పదజాలంతో దూషించాడని, దీంతో తాను అతన్ని బయటకు పంపించేసానని, తనపై దాడి చేయలేదని వివరణ ఇచ్చారు.

జరిగిన ఘటనపై ఇరువురు దమ్మపేట పోలీస్ స్టేషన్ లో పరస్పర ఫిర్యాదు చేసుకున్నారు.

Similar News