పొంగులేటి ఇలాకాలో బీఆర్‌ఎస్‌లో చేరికలు
గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తాత మధు;
పొంగులేటి ఇలాకాలో బీఆర్‌ఎస్‌లో చేరికలు
కాంగ్రెస్‌కు ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలందరూ ఇప్పుడు బాధపడుతూ ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారని, ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారని బీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు.
శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు గాదరి వీరస్వామి, అన్నపర్తి పరశురాం, సురేశ్‌తోపాటు 30 కుటుంబాలు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ తాతా మధు గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా తాతా మధు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌లో చేరిన వారికి పార్టీ అండగా ఉంటుందని, ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్ధానాలు విని ఆ పార్టీకి ఓట్లు వేశామని, కేసీఆర్‌ను ఓడించడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని భావించిన నాయకులు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌ను వీడుతున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తిరుమలాయపాలెం మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు బాషబోయిన వీరన్న, ఖమ్మం రూరల్ మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు బెల్లం వేణు, నాయకులు పాల్గొన్నారు.