ప్రైవేటు ఆస్పత్రిలో అదుపు తప్పిన లిఫ్ట్
రెండో అంతస్తు నుంచి అత్యంత వేగంగా కిందకు పడిన వైనం;
ప్రైవేటు ఆస్పత్రిలో అదుపు తప్పిన లిఫ్ట్
రెండో అంతస్తు నుంచి అత్యంత వేగంగా కిందకు పడిన వైనం
స్ట్రెచర్‌పైనే ప్రాణాలు విడిచిన మహిళ
ఖమ్మం నగరంలో విషాదం
తెలంగాణలో వరుస లిఫ్ట్ ప్రమాదాలు సవాలు విసురుతున్నాయి. 4 వారాల్లో నాలుగు ఘటనలు జరిగాయి. తాజాగా జరిగిన ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.
ఖమ్మం నగరంలో ఉన్న ప్రసూన ప్రైవేట్ ఆసుపత్రిలో లిఫ్ట్ జారి పడి సరోజనమ్మ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. లిఫ్టు క్యాబిన్ ఒక్కసారిగా పైకెళ్లి కిందకు కూలిపోవడంతో ఆమె మృతిచెందిన ఘటన ఖమ్మం నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది.
బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. ముదిగొండ మండలం వనంవారి కిష్టాపురం గ్రామానికి చెందిన సట్టు సరోజనమ్మ(55)కు ఈ నెల 20న ఛాతీలో నొప్పి రావడంతో ఖమ్మం నెహ్రూనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చారు. గుండె సమస్య ఉందని వైద్యులు చెప్పడంతో అక్కడే చేర్చారు.
శుక్రవారం సాయంత్రం ఆమె గుండెకు స్టెంటు వేశారు. అనంతరం రెండో అంతస్తులో ఉన్న ఆపరేషన్ థియేటర్ నుంచి నాలుగో అంతస్తులోని ఐసీయూకు మార్చేందుకు ఇద్దరు సిబ్బంది సరోజనమ్మను స్ట్రెచర్‌పై తీసుకువెళ్తున్నారు.
ఈ క్రమంలో లిఫ్టు ఎక్కిస్తుండగా స్ట్రెచర్ సగం వరకు లోపలికి వెళ్లిన తర్వాత.. లిఫ్టు క్యాబిన్ ఒక్కసారిగా పైకి వెళ్లింది.
మహిళ, సిబ్బంది లోపల ఉండిపోయారు. పైకి వెళ్లిన లిఫ్టు తిరిగి కిందకు పడిపోయింది. లోపల ఇరుకున్న ఇద్దరినీ డోరు తొలగించి బయటకు తీశారు. గాయపడిన సరోజనమ్మకు చికిత్స అందిస్తుండగా మృతిచెందారు.
ఆసుపత్రి సిబ్బంది ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనపై ఇంకా ఫిర్యాదు అందలేదని సీఐ బాలకృష్ణ తెలిపారు. మృతురాలికి భర్త, కుమారుడు ఉన్నారు.