అధికార పార్టీకి ఎన్నికల కోడ్ చుట్టమా...?

అధికార పార్టీకి ఎన్నికల కోడ్ చుట్టమా...?;

By :  Ck News Tv
Update: 2025-02-26 10:54 GMT


అధికార పార్టీకి ఎన్నికల కోడ్ చుట్టమా...?

వైరా మున్సిపాలిటీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతుంది. ఒకవైపు ఎన్నికల కోడ్ అమలులో ఉండగా మరోవైపు ఆ కోడ్ తమకు పట్టనట్లు రాజకీయ పార్టీ నాయకులు ఇష్టానుసారంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు.

అయితే ఎన్నికల కోడ్ ను అమలు చేయడంలో వైరా మున్సిపాలిటీ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వైరా మండలంలోని స్నానాల లక్ష్మీపురం గ్రామంలో బుధవారం నుంచి జాతర జరుగుతుంది.

భక్తులు ఈ జాతరకు వెళ్లే మార్గంలో సాయిబాబా గుడి వద్ద ఉన్న క్రాస్ రోడ్డు నుంచి గండగల పాడు గ్రామం వరకు ఆర్ అండ్ బీ రోడ్డుపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాలకు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన పట్టించుకునే వారు కరువయ్యారు.

ఈ ప్లెక్సీలు చూసిన పలు పార్టీల నాయకులు అధికార పార్టీకి ఎన్నికల కోడ్ చుట్టమా అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలు చేయాల్సిన అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.

ఎవరి గోల వారిది.. ఒకవైపు ఎన్నికల కోడ్ లో ప్లెక్సీలు ఏర్పాటు చేయటం పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సమయంలో అధికార పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ప్రముఖ నాయకుల ఫోటోలు పెట్టలేదని మరో వివాదస్పద చర్చ కొనసాగుతుంది.

గండగలపాడు గ్రామంలో ప్రధాన రహదారికి ఇరువైపులా " నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి - నేడు రేవంత్ రెడ్డి" అనే క్యాప్షన్ తో కొన్ని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలలో స్నానాల లక్ష్మీపురం గ్రామానికి చెందిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, జిల్లా మంత్రులు, వైరా ఎమ్మెల్యే ఇతర కాంగ్రెస్ ప్రముఖ నాయకుల ఫోటోలు ఏర్పాటు చేయకపోవడం వివాదాస్పదమవుతుంది.

కేవలం వైయస్ రాజశేఖర్ రెడ్డి, రేవంత్ రెడ్డి నిలువెత్తు ఫోటోలు పెట్టి కొన్ని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే స్థానికుడైన ఉపముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఎమ్మెల్యే ఫోటోలను కొన్ని ఫ్లెక్సీలో ఏర్పాటు చేయకపోవడం పట్ల స్థానిక కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యవహారాన్ని చూసిన ప్రజలు ఎవరి గోల వారిదని చర్చించుకోవడం విశేషం. ఈ ఫ్లెక్సీలను ఎవరైనా కావాలని వేశారా అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి అంటూ గుసగుసలు .

Similar News