పోలీస్ యూనిఫాంలో వచ్చి మొత్తం దోచేసిన దొంగలు...!

By :  Ck News Tv
Update: 2025-02-13 04:14 GMT

పోలీస్ యూనిఫాంలో వచ్చి మొత్తం దోచేసిన దొంగలు.

ఖమ్మంలో పట్టపగలే దొంగలు బరితెగించారు. ఇంటింటి సర్వే చేస్తున్నామంటూ ఇంట్లోకి చొరబడిన ఉన్నదంతా దోచుకెళ్లారు. అంతేకాదు ఓ వ్యక్తి పోలీస్ యూనిఫాం వేసుకోగా తనవెంట ఉన్నవాళ్లంతా ప్రభుత్వ అధికారులమంటూ నమ్మించి బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు.

ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా పట్టణం సుందరయ్యనగర్లో జరగగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యాహ్నం 12 గంటల సమయంలో..

సుందరయ్య నగర్ లో నివాసముంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు శీలం యుగేంధర్ రెడ్డి ఇంట్లోకి మధ్యాహ్నం 12 గంటల సమయంలో దొంగలు ప్రవేశించారు. అందులో ఒక వ్యక్తి పోలీస్ యూనిఫాంలో ఉండటంతో ఎవరికీ అనుమానం రాలేదు. ఇక ఇంట్లో ఒంరిగా ఉన్న యుగేంధర్ రెడ్డి తల్లి వెంకటమ్మను తాము సర్వే కోసం వచ్చామని, వివరాలు తెలపాలని కోరారు. ఒకపక్క వివరాలు అడుగుతూనే మరోపక్క కొందరు నెమ్మదిగా పనిలో దిగిపోయారు. కాసేపటికి వెంకటమ్మకు మత్తుమందు ఇచ్చి నోటిని, చేతులను ప్లాస్టర్ తో చుట్టేశారు. ఆమె చేతికున్న బంగారు గాజులు, మెడ గొలుసు, చెవిదిద్దులు కూడా లాక్కున్నారు. అనంతరం ఇంట్లోని బీరువాలో ఉన్న 15తులాల బంగారం, పదివేల రూపాయల నగదు దోచుకెళ్లారు.

మత్తునుంచి తేరుకోగానే..

అయితే మత్తునుంచి తేరుకుని ప్లాస్టర్ ను తొలగించేందుకు వెంకటమ్మ ప్రయత్నిస్తున్నపుడే కోడలు లలిత ఇంటికి చేరుకుంది. వెంటనే ఇంట్లో దొంగలు పడ్డారని, బంగారం దోచుకెళ్లారని చెప్పడంతో ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించింది. శీలం యుగేంధర్ రెడ్డి కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్నారు. యుగేంధర్ రెడ్డి సతీమణి లలిత వైరా పట్టణంలోని స్థానిక ప్రైవేటు పాఠశాలలో టీచర్ గా పనిచేస్తోంది. చోరీ సమయంలో కొడుకు, కోడలు లేకపోవడంతో వృద్ధురాలు ఒంటరిగా ఉండటం చూసి దొంగలు ఇలా చేశారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఘటనాస్థలికి చేరుకున్న లాఅండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ ప్రసాద్ రావ్, వైరా ఏఎస్పీ రెహమాన్ క్లూస్ టీం సహాయంతో విచారణ చేపట్టారు. దొంగలు వైట్ కలర్ మారుతి స్విఫ్ట్ డిజైర్ కారులో వచ్చినట్లు అనుమానిస్తున్నారు. దొంగతనం అనంతరం తిరిగి వచ్చిన కార్లో వెళ్లిపోయినట్లు అంచనా వేస్తున్నారు. మిట్టమధ్యాహ్నం దొంగలు మత్తుమందు ఇంచి చోరీకి పాల్పడటంతో స్థానికులు భయాందోళనకు గురైనట్లు చెబుతున్నారు

Similar News