మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కు అపోయింట్మెంట్ ఇవ్వని సీఎం
మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కు అపోయింట్మెంట్ ఇవ్వని సీఎం;
*మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కు అపోయింట్మెంట్ ఇవ్వని సీఎం*
హైదరాబాద్, ఫిబ్రవరి /ఇల్లందు: గుమ్మడి నర్సయ్య (gummadi narsaiah) పరిచయం అక్కరలేని ప్రజా ఉద్యమకారుడు. ఐదు సార్లు ఎమ్మెల్యే (MLA)గా గెలిచిన కమ్యూనిస్టు నాయకుడు. అలాంటి నేత.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడుసార్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (RAVANTH REDDY)ని కలిసేందుకు ప్రయత్నించారు. కానీ, ఒకసారి కూడా సీఎం (CM) కనికరించలేదు. మొన్న రోజంతా జూబ్లీహిల్స్ అధికారిక నివాసం వద్ద.. నిన్న సెక్రటేరియట్ (SECRETARIAT) దగ్గర.. చివరకు గురువారం ఆయన ఇంటి వద్ద మరోసారి పడిగాపులు గాసినా.. సీఎం రేవంత్‌రెడ్డి ఆయన్ను కలిసేందుకు ఇష్టపడలేదు. చివరకు ఇంటిగేటుముందు గంట ల తరబడి వేచి చూసిన నర్సయ్యకు నిరాశే మిగిలింది. రేవంత్‌రెడ్డి(REVANTH REDDY) కాన్వాయ్‌లో వెళ్తుం టే.. నర్సయ్య దీనంగా ఆయన వంక చూస్తు న్నా.. సీఎం చూసీచూడనట్టు వెళ్లిపోవటం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది. దీంతో 'అయ్యో.. ఏందిసారూ ఇలా చేశారు.. పెద్దమనిషిని ఎండల తిప్పిస్తవా? ప్రజా సమస్య మీదనే వచ్చారుగా.. పాపం కలిసే అవకాశం ఇస్తే ఏమైంది?' అని ప్రజా ఉద్యమకారులు రేవంత్‌రెడ్డిని అడుగుతున్నారు.
రోజంతా ఎండలో నిలబడ్డా..
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, సీపీఐఎంఎల్(న్యూ డెమోక్రసీ) నాయకుడు గుమ్మడి నర్సయ్యకు గురువారం తీవ్ర అవమానం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు మంగళవారం హైదరాబాద్ వచ్చిన ఆయన రోజుల తరబడి ఎండలో వేచి చూసినప్పటికీ ఆయన్ను కలిసేందుకు సీఎం అంగీకరించలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజరవర్గంలో పోడు భూములపై గిజనులకు హక్కులు కల్పించాలని, సీఎం ప్రకటించిన రైతు భరోసా డబ్బులు ఇప్పటి వరకు ఖాతాల్లో పడలేదని, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు కావటం లేదని రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు గుమ్మడి నర్సయ్య హైదరాబాద్‌కు వచ్చారు. తనకు పరిచయం ఉన్న అధికారుల ద్వారా సీఎం అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించారు. మంగళవారం ఉదయం సీఎం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఉన్నట్టు తెలియటంతో అక్కడికి వెళ్లారు. మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపు సీఎం కలిసే అవకాశం ఉందని సిబ్బంది చెప్పడంతో రోజంతా ఎండలోనే నిలబడి వేచిచూశారు. కానీ, సీఎం ఆయన్ను కలిసేందుకు అనుమతించలేదు.
కాన్వాయ్‌కి ఎదురెళ్లినా..
బుధవారం సీఎం సెక్రటేరియట్‌లోఉన్నారనే సమాచారం అందుకున్న నర్సయ్య ఉదయమే అక్కడికి వెళ్లారు. మరోసారి ముఖ్యమంత్రి అనుమతి కోసం ప్రయత్నించారు. తనకు పరిచయం ఉన్న అధికారులతో సీఎం కార్యాలయానికి ఫోన్ చేయించి సమాచారం ఇచ్చారు. ఏ సమయంలోనైనా సీఎం పిలవచ్చనే ఆశతో రోజంతా సెక్రటేరియట్ గేట్ బయటే పడిగాపులు కాచారు. దినం గడిచింది కానీ, సీఎం నుంచి పిలుపు రాకపోవడంతో ఆయన నిరాశతో వెనుదిరిగారు. గురువారం ఉదయం మరోసారి సీఎం నివాసం జూబ్లీహిల్స్‌కు వెళ్లి ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించారు. ఎండలో గంటల తరబడి బయట వేచిచూసినప్పటికీ నర్సయ్యను లోపలికి అనుమతించలేదు. సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్తున్న ముఖ్యమంత్రిని గమనించిన గుమ్మడి నర్సయ్య సీఎం కాన్వాయ్‌కి ఎదురెళ్లినా.. చూసీచూడనట్టుగా వెళ్లటంతో తీవ్ర అవమానంతో వెనుదిరిగారు.
ఏ సీఎం నన్ను ఇలా అవమానించలే..
నేను ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన. నా నియోజకవర్గంలో ప్రజాసమస్యలపై రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు వచ్చిన. ఇది మొదటిసారి కాదు. నాలుగోసారి. ఒక్కసారి కూడా సీఎం రేవంత్‌రెడ్డి నాకు అపాయింట్‌మెంట్ ఇయ్యలేదు. నేను ఎన్టీఆర్ దగ్గరి నుంచి మొదలు రాజశేఖర్‌రెడ్డి, కేసీఆర్ వరకు ముఖ్యమంత్రులను చూశాను. ఏ సీఎం కూడా నన్ను ఇట్ల అవమానించలేదు. ప్రజా సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇవ్వటానికే వచ్చాను. గిరిజనులకు పోడు భూములపై హక్కులు కావాలని కోరేందుకు వచ్చాను. రైతు భరోసా పడ్డదని సీఎం చెప్పిండ్రు. కానీ, ఇంతవరకు రైతు భరోసా అందలేదు. ఈ సమస్యలు రేవంత్‌రెడ్డికి చెప్పటానికి మూడ్రోజుల కింద హైదరాబాద్‌కు వచ్చిన. సీఎం ఇంట్లో ఉన్నాడంటే ఇంటికి పోయిన. సెక్రటేరియట్‌లో ఉన్నాడంటే అక్కడికి వెళ్లిన. ఇయ్యాల ఇంట్లనే ఉంటడంటే మళ్లీ ఇంటికి పోయిన. ఎన్నిసార్లు ప్రయత్నించినా కలువలేదు. రైతుబంధు ఇయ్యమని ఎవరడిగిండ్రు? కేసీఆర్ రూ.10 వేలు ఇస్తన్నడు.. నేను రూ.15 వేలు ఇస్త అని చెప్తివి. ఓట్లేయించుకొని గెలిచినంక రూ.12 వేలే ఇస్తంటివి. అవి కూడా ఇప్పటి వరకు పడకపాయే. రేవంత్‌రెడ్డి నాపై నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నట్టుగానే భావిస్తున్నా.
– గుమ్మడి నర్సయ్య, మాజీ ఎమ్మెల్యే