సీట్ల సంఖ్యలో మార్పు లేకుండా పునర్విభజన ప్రక్రియ చేపట్టాలి
దక్షిణాది రాష్ట్రాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..;
సీట్ల సంఖ్యలో మార్పు లేకుండా పునర్విభజన ప్రక్రియ చేపట్టాలి
దక్షిణాది రాష్ట్రాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..
✳️ మరో 25 ఏళ్లపాటు లోక్‌సభ సీట్లలో ఎటువంటి మార్పు తీసుకురావద్దు. సీట్ల సంఖ్యలో మార్పు లేకుండా పునర్విభజన ప్రక్రియ చేపట్టాలి. పునర్విభజనకు రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకొని చేయాలి. రాష్ట్రాల్లోని జనాభా ఆధారంగా పునర్విభజన చేపట్టాలి.
✳️ రాష్ట్రాల్లోని నగరాలు, గ్రామాల్లోని జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్ల హద్దులను మార్పు చేయాలి. తాజా జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ సీట్ల సంఖ్య పెంచాలి. ప్రతి రాష్ట్రంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. లోక్ సభ స్థానాల పెంపును మరో 25 ఏళ్లపాటు వాయిదా వేయాలి.
✳️ జనాభా నియంత్రణలో ప్రగతి సాధించిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించే విధానానికి కేంద్రం స్వస్తి చెప్పాలి. జనాభా దామాషా ప్రాతిపదికన పునర్విభజన చేపట్టొద్దని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి దేశంలోని ఇతర రాష్ట్రాలతో సంబంధం లేకుండా చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీట్లను ఏర్పాటు చేసినట్లే దక్షిణాదికి అవకాశం ఇవ్వాలి.
✳️ మంచి ప్రగతి సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ సీట్లలో మంచి వాటా ఇవ్వడం ద్వారా ఇతర రాష్ట్రాలు ఆర్థిక వృద్ది, సుపరిపాలనపై దృష్టి సారించేలా చేయాలి.
✳️ ప్రధాన డిమాండ్ - 543 సీట్లు ఉన్న లోక్‌సభలో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య 130. ఇది మొత్తం సీట్లలో 24 శాతం. పునర్విభజన తర్వాత ఏర్పడే నూతన లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు 33 శాతం సీట్లు ఇవ్వాలి.
✳️ దేశవ్యాప్తంగా 50 శాతం సీట్లను పెంచాలనుకుంటే అలా పెరిగే 272 సీట్లతో మొత్తం లోక్‌సభ సీట్ల సంఖ్య 815 అవుతుంది. ఇందులో 33 శాతం అంటే దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ సీట్లు 272 గా ఉండాలి. ఈ సీట్లను దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలకు ఇప్పుడున్న ప్రొరేటా ప్రాతిపదికన పంచవచ్చు.
✳️ దేశంలో మిగిలిన సీట్లను ఉత్తరాది, ఇతర రాష్ట్రాలకు కేంద్రం పంచవచ్చు. అనుకున్న దానికంటే దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్య తగ్గిస్తే అది దేశ రాజకీయ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.