వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం..!!

వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం..!!;

By :  Ck News Tv
Update: 2025-04-03 07:32 GMT

వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం..!!

- అనుకూలం..282..వ్యతిరేకం

- లోక్సభలో 12 గంటలపాటు సాగిన చర్చ

- ఓటింగ్ కు ప్రధాని మోడీ డుమ్మా

- నేడు రాజ్యసభ ముందుకు బిల్లు

- రాజ్యాంగ మౌలిక నిర్మాణంపై దాడి : ప్రతిపక్ష పార్టీల ఎంపీలు

- దీన్ని ఇండియా బ్లాక్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది


న్యూఢిల్లీ:వివాదాస్పద వక్ఫ్(సవరణ) బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై బుధవారం లోక్సభలో వాడీవేడీ చర్చ జరిగింది. 12 గంటల పాటు సుదీర్ఘ చర్చ అనంతరం అర్ధరాత్రి దాటిన(12.58 గంటలకు) తర్వాత బిల్లు ఆమోదం కోసం స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు. అనుకూలంగా 282 మంది సభ్యులు ఓటు వేయగా.. 232 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు.

బీజేపీ నేతత్వంలోని ఎన్డీయే పక్షాలు, ప్రతిపక్ష ఇండియా బ్లాక్లోని ప్రధాన పార్టీలు తమ ఎంపీలు అందరికీ విప్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్డీయే కూటమిలోని కోందరు ఎంపీలు క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్టు సమాచారం.

దీంతో కేవలం 50 ఓట్ల తేడాతో లోక్సభలో వక్ప్ సవరణ బిల్లుకు లైన్క్లియర్ అయింది. అయితే ఈ బిల్లు గురువారం రాజ్యసభకు వెళ్లనుంది. ఈ బిల్లుపై చర్చకు ఎగువసభలో 8 గంటల సమయాన్ని కేటాయించారు.

రాజ్యాంగ మౌలిక నిర్మాణంపై దాడి : ప్రతిపక్ష పార్టీల ఎంపీలు

రాజ్యాంగ మౌలిక నిర్మాణంపై వక్ఫ్ సవరణ బిల్లు దాడి చేస్తోందని, దీనిని ఇండియా బ్లాక్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ప్రతిపక్ష పార్టీల నేతలు స్పష్టం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లును బుధవారం లోక్సభలో కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చల్లో వివిధ పార్టీల నుంచి 35 మంది సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ యూపీఏ హయాంలో ఈ వక్ఫ్ చట్టంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. 1970 నుంచి ఢిల్లీలో జరుగుతున్న ఒక కేసులో పార్లమెంట్ భవనంతో సహా అనేక ఆస్తులు ఉన్నాయన్నారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డు వీటిని క్లెయిమ్ చేసిందని, ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉందని గుర్తు చేశారు. కానీ అప్పుడు యూపీఏ 123 ఆస్తులను డీనోటిఫై చేసి వక్ఫ్ బోర్డుకు ఇచ్చిందని కేంద్ర మంత్రి రిజిజు పేర్కొన్నారు.

అయితే ఈ వక్ఫ్ సవరణ బిల్లు తీసుకురాకపోతే, పార్లమెంట్ భూమిని సైతం వక్ఫ్ ఆస్తి అనే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వక్ఫ్ చట్టంలోని పలు క్రూరంగా పరిగణించే అంశాలను తమ ప్రభుత్వం తొలగించిందన్నారు. అంతేకాకుండా.. దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాలు తమిళనాడు, కర్నాటకలోని పలు దేవాలయాలతోపాటు హర్యానాలోని వివిధ గురుద్వార్లను ముస్లిం సమాజం వక్ఫ్ భూమిగా క్లయిమ్ చేసిందని రిజిజు వివరించారు.

సమాఖ్య నిర్మాణంపై దాడి : గౌరవ్ గొగోయ్

ఈ సందర్భంగా జరిగిన చర్చలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ ఈ బిల్లు రాజ్యాంగంలోని నిబంధనలను నీరుగార్చే, మైనార్టీలను కించపరిచే, వారి హక్కులను తొలగించే, భారత సమాజాన్ని విభజించడం వంటి నాలుగు లక్ష్యాలతో ఉందని ధ్వజమెత్తారు.

ప్రభుత్వం పార్లమెంట్ను తప్పుదారి పట్టించిందని, ఈ విషయంలో గతంలో జరిగిన చర్చలను కూడా ఆయన ప్రస్తావించారు. ఈ బిల్లు మన సమాఖ్య నిర్మాణంపై దాడి చేస్తుందని అన్నారు. ఈ బిల్లుపై మైనార్టీ ప్రతినిధులతో తగినంతగా చర్చించలేదని పేర్కొన్నారు. ఈ బిల్లు సవరణలు సమర్పించడానికి ఒక ఏడాది ముందు, 2023లో జరిగిన పార్లమెంటరీ కమిటీలో నాలుగు సమావేశాలు జరిగాయని, వాటిలో దేనిలోనూ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ బిల్లును ఎందుకు ప్రస్తావించలేదని కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

ఈ బిల్లు మహిళలకు హక్కులు ఇస్తున్నట్లు, ప్రస్తుతం చట్టం మహిళలపై వివక్ష చూపుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వాస్తవానికి ప్రస్తుత చట్టంలో వితంతువులు సహా మహిళ రక్షణ, సాధికారత కోసం నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రతిపక్షాల సూచనలను జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించారు.

దేశ లౌకిక ప్రతిష్టను దెబ్బతీస్తుంది: అఖిలేష్ యాదవ్

ఈ బిల్లు విభజన లక్ష్యంగా ఉందని, దేశ లౌకిక ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రపంచానికి తప్పుడు సందేశం పంపుతుందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీకి తగ్గుతున్న ఓటుబ్యాంకును నిర్వహించడానికి ఈ బిల్లును తీసుకొచ్చారని విమర్శించారు. బీజేపీ తన విధానాల కారణంగా ఇప్పుడు పార్టీకి దూరంగా ఉన్న మద్దతుదారులను సంతృప్తి పరచాలని కోరుకుంటుందని అన్నారు.

ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఓట్ల శాతం తగ్గినందున, బీజేపీ ఓట్లను నియం త్రించ డానికి ప్రయత్నిస్తోందని దుయ్యబ ట్టారు. కొంత మంది సభ్యులు బిల్లుకు మద్దతు ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నప్పటికీ, లోపల వారు సంతోషంగా లేరని అన్నారు. వక్ఫ్ బిల్లు తీసుకురావడం బీజేపీ రాజకీయ క్రీడ, ఇది వారి మత రాజకీయాలకు కొత్తరూపం అని విమర్శించారు.

వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు చోటు లేదు: అమిత్షా

వక్ఫ్ సవరణ బిల్లుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, ముస్లింల మతపరమైన వ్యవహారాల్లో ఎలాంటి జోక్యం ఉండదని కేంద్ర హౌం మంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరలకు చోటు లేదని స్పష్టం చేశారు. 'వక్ఫ్ చట్టం, బోర్డు 1995లో అమల్లోకి వచ్చాయి.

వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేరుస్తామని, వక్ఫ్లో జోక్యం చేసుకుంటామని కొందరు వాదనలు చేస్తున్నారు. మొదటగా వక్ఫ్ బోర్డులో ఏ ముస్లిమేతరులు ఉండరని నేను చెప్పదలచుకున్నాను. అలాంటి ప్రొవిజన్ ఏదీ ఇందులో లేదు.

అలా చేయాలని కూడా మేము కోరుకోవడం లేదు. ముస్లింల మతపరమైన కార్యక్రమాల్లో, వాళ్లు విరాళాలుగా ఇచ్చిన ఆస్తుల్లో జోక్యం చేసుకుంటామనేది కూడా పూర్తిగా అపోహ. కేవలం ముస్లింల ఓటు బ్యాంకు కోసమే ఇలాంటి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి' అని అమిత్షా పేర్కొన్నారు.

2014 ఎన్నికలకు ముందు న్యూఢిల్లీలోని 123 వీఐపీ ఆస్తులను వక్ఫ్ బోర్డుకు కాంగ్రెస్ ఇచ్చింది. 2013లో కూడా వక్ఫ్ చట్టానికి సవరణలు చేయడంతో రైల్వే భూమిని వక్ఫ్కు ఇచ్చింది. జేడీయూ కూడా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చింది. జేడీయూ నేత, కేంద్ర మంత్రి లాలన్ సింగ్ మాట్లాడుతూ ఈ సవరణలు వెనుకబడిన, పేదలు, మహిళల ప్రయోజనాల కోసమే అని అన్నారు.

మద్దతు ఇచ్చిన పార్టీలు

బీజేపీ, టీడీపీ, జేడీయూ, శివసేన (షిండే), అప్నాదళ్, జనసేన, ఎల్జేపీ, జేడీఎస్, ఆర్ఎల్డీ, ఎన్సీపీ (అజిత్ పవర్)

వ్యతిరేకించిన పార్టీలు

కాంగ్రెస్, ఎస్పీ, డీఎంకే, టీఎంసీ, సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ ఎంఎల్, ఎన్సీపీ (శరద్ పవర్), శివసేన (ఠాక్రే), వైసీపీ, ఆర్జేడీ, జెఎంఎం ఆప్ నేషనల్ కాన్ఫరెన్స్, ఐయూఎంఎల్, వీసీకేజీ , ఆర్ఎస్పీ, ఎంఐఎం

Similar News