ఎస్సై దూషించాడని మహిళ ఆత్మహత్యాయత్నం
ఎస్సై దూషించాడని మహిళ ఆత్మహత్యాయత్నం;
ఎస్సై దూషించాడని మహిళ ఆత్మహత్యాయత్నం
ఎస్సై తనను అసభ్య పదజాలంతో దూషించాడని మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన చివ్వెంల మండల పరిధిలోని కుడకుడ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. వల్లాల జానకిరాములు తన కుటుంబ సభ్యులతో కలిసి గత 50 సంవత్సరాలుగా కుడకుడ గ్రామంలో నివాసం ఉంటున్నాడు.
ఈ క్రమంలో ఇంటి పక్కన ఉన్న అతని బంధువులు వల్లాల రాములు, వల్లాల నరేష్, వల్లాల సురేష్, కొత్త సైదులు, కొత్త శైలజలకు గత కొంతకాలంగా ప్రహరీ విషయంలో వివాదం జరుగుతోంది.
ఈ క్రమంలో ఈనెల 7న స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఇరువర్గాలు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో పోలీసులు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవాలని చెప్పారు.
పెద్ద మనుషులు ఈనెల 15కు వాయిదా వేశారు. ఈక్రమంలో జానకిరాములు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అతడిని 13వ తేదీన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఆ సమయంలో భార్య రమణమ్మ మాత్రమే ఇంట్లో ఉంది.
చివ్వెంల ఎస్‌ఐ మహేశ్వర్ సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటి మధ్య ప్రహరీ కట్టిస్తుండగా, గమనించిన రమణమ్మ ఇంట్లోంచి బయటకు వచ్చింది.
వాయిదా ఉండగా ఎందుకు గోడ కట్టిస్తున్నారని ప్రశ్నించింది. దీంతో ఎస్సై తనను అసభ్య పదజాలంతో దూషించాడని రమణమ్మ ఆరోపించింది.
మనస్తాపంతో గురై 14న ఇంట్లో ఉన్న స్లీపింగ్, యాంటి బయోటిక్, పెయిన్ కిల్లర్ మందులు వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.
గమనించిన ఇంటి పక్కవారు ఆమెను సూర్యాపేటలోని ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం చికిత్స పొందుతోంది.
తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
ఈ విషయంపై ఎస్‌ఐ మహేశ్వర్‌ను వివరణ కోరగా.. రమణమ్మ ఇంటి పక్కన ఉన్న కొత్త సైదులు..
తన ఇంటిపై వల్లాల శివరామకృష్ణ అనే వ్యక్తి వేట కొడవలితో దాడి చేసి భయాబ్రాంతులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదు చేశాడని తెలిపారు.
విచారణ కోసం వెళ్లి తిరిగి వచ్చానని, అక్కడ ఎవరిని ఏమి అనలేదని పేర్కొన్నారు. కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారని ఎస్‌ఐ తెలిపారు.