ఇసుక ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలి సీఎం ఎ.రేవంత్ రెడ్డి
మైనింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం;
మైనింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం
ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోగలమని, ప్రభుత్వానికి ఆదాయం పెంచగలమని చెప్పారు.
గనుల శాఖపై ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గత నెల రోజులుగా తీసుకున్న చర్యలతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడిన విధానాన్ని, పెరిగిన ఆదాయాన్ని అధికారులు సీఎం కి వివరించారు. ఈ సందర్భంగా ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలు, రవాణా, వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక సరఫరాపై అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.
ప్రభుత్వంలోని నీటి పారుదల, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్‌తో పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో చేప్టటే పనులకు, పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టే సంస్థలకు అవసరమైన ఇసుకను తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (TGMDC) నుంచే సరఫరా చేసేలా చూడాలన్నారు.
సరైన ధరలకు ప్రభుత్వమే ఇసుక సరఫరా చేస్తే వినియోగదారులు అక్రమంగా సరఫరా చేసే వారిపై ఆధారపడరని అన్నారు. హైదరాబాద్ నగరంతో పాటు సమీప ప్రాంతాల్లోనే ఇసుక ఎక్కువగా వినియోగం జరుగుతోందన్నారు. తక్కువ మొత్తంలో ఇసుక అవసరమైన వారు కొనుగోలు చేసేలా నగరానికి మూడు వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
గనుల శాఖ పరిధిలోని వివిధ ఖనిజాల క్వారీలకు గతంలో విధించిన జరిమానాలు, వాటి వసూళ్లపైనా సీఎం అధికారులను ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన విధానపరమైన నిర్ణయం త్వరగా తీసుకొని సమస్యను పరిష్కరించాలని చెప్పారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నఖనిజాల మైనర్ బ్లాక్‌ల వేలానికి వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , టీజీఎండీసీ ఛైర్మన్ ఈరవత్రి అనీల్ , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.