కానిస్టేబుల్‌పై అనర్హత వేటు...!

హాట్‌టాపిక్‌గా మారిన వైనం;

By :  Ck News Tv
Update: 2025-02-15 02:54 GMT

కానిస్టేబుల్‌పై అనర్హత వేటు...!


పేకాటరాయుళ్లతో మామూళ్ల వసూలు

హాట్‌టాపిక్‌గా మారిన వైనం

మండలంలో గుట్టుగా పేకాట ఆడుతున్నట్లు ఓ వ్యక్తి కానిస్టేబుల్‌కు సమాచారం అందించాడు. అయితే తనకు సంబంధం లేని మండలంలోకి వచ్చి నేరుగా పేకాట స్థావరం వద్దకు చేరుకుని పోలీస్‌ దర్పం ప్రదర్శించాడు.దీంతో పేకాటరాయుళ్లు భయాందోళనకు గురై కొంత డబ్బులు ఇస్తామనడంతో రూ. 20 వేలకు ఒప్పందం చేసుకుని అక్కడి నుంచి జారుకున్నాడు.

ఈ విషయం వైరల్‌ కావడంతో 15 రోజుల క్రితం జిల్లా పోలీసుశాఖ రహస్య విచారణ చేపట్టి ఎట్టకేలకు సంబంధిత కానిస్టేబుల్‌పై అనర్హత వేటు వేయడం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వేళ్తే.. గద్వాల రూరల్‌ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రమేష్‌నాయక్‌ ఇటీవల సాధారణ బదిలీలో భాగంగా మల్దకల్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీపై వెళ్లాడు.

అయితే 15 రోజుల క్రితం గద్వాల మండలంలోని ఓ గ్రామ శివారులో కొందరు పేకాట ఆడుతున్నట్లు ఓ అజ్ఞాత వ్యక్తి కానిస్టేబుల్‌ రమేష్‌నాయక్‌కు సమాచారం అందించగా.. పేకాట స్థావరం వద్దకు వెళ్లి కానిస్టేబుల్‌ పేకాటరాయుళ్లను బెదిరించి రూ. 20 వేలు వసూలు చేసి అక్కడి నుంచి జారుకున్నాడు. అయితే ఈ విషయాన్ని బాధితులు స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

రంగంలోకి ప్రత్యేక విభాగం

మల్దకల్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ రమేష్‌పై వచ్చిన ఆరోపణలపై జిల్లా పోలీసు శాఖ ఆదేశాల మేరకు ప్రత్యేక విభాగం సిబ్బందిని రంగంలోకి దింపి రహస్య విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్‌ను 15 రోజుల పాటు విచారణ చేసిన అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అతడిపై అనర్హత వేటు వేస్తూ శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. కానిస్టేబుల్‌ చేసిన నిర్వాకంపై జిల్లా పోలీసుశాఖ తీసుకున్న చర్యలకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News