బ్యాంకు లో రైతుల అర్ధనగ్న నిరసన...
తమ ఖాతాలో జమ చేసి ఉన్నా డబ్బులను తమకు ఇవ్వాలని రైతులు మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు లో అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.ఉదయం నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు బ్యాంక్ లో బైఠాయించి నిరసన తెలిపారు.ఇది తెలుసుకున్న పోలీసులు,రైతులతో,బ్యాంకు మేనేజర్ తో మాట్లాడారు.ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ తెలిపిన వివరాల ప్రకారం తాంసి మండలంలోని వడూర్ గ్రామానికి చెందిన జిల్లెల మోహన్ కు ఒక లక్ష,ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపలగూడ గ్రామానికి చెందిన రైతు నల్ల విలాస్ కు రూ.76000లు,ఇదే గ్రామానికి చెందిన రైతు నక్కల జగదీష్ కు రూ.2 లక్షలు గత ఏడాది పత్తి పంటకు సంబంధించిన డబ్బులు పోస్టాఫీసు ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు.అయితే ఈ డబ్బులు జమ చేసిన వెంటనే సంబంధిత అప్పటి పోస్ట్ ఆఫీస్ మేనేజర్ విజయ్ జాదవ్ సైబర్ క్రైమ్ కు పాల్పడడం తో పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందని తెలియజేశారు.
ఈ క్రమంలో రైతులకు రావలసిన డబ్బులు సంబంధిత ఢిల్లీ బ్యాంక్ లో హోల్డ్ లో ఉన్నాయని వెల్లడించారు.అయితే కొంతమంది రైతులకు అప్పుడు జరిగిన ఆందోళనతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా జోక్యంతో డబ్బులు చెల్లించడం జరిగిందని,మరికొంత మంది రైతులకు చెల్లింపులు కాలేదని అన్నారు.ప్రస్తుతం రైతుల ఆందోళనతో సంబంధిత బ్యాంక్ అధికారులతో మాట్లాడటం జరిగిందని, త్వరలో రైతులకు రావలసిన డబ్బులు చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.దీంతో రైతులు ఆందోళనను విరమించారు.ఇది ఇలా ఉంటే ముందుగా రైతులు ఏడాదిగా తిరుగుతున్న బ్యాంక్ అధికారులు మాత్రం తమను పట్టించుకోవడం లేదని,మా డబ్బులు మాకు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపడంతో బ్యాంక్ లో గందర గోళం నెలకొంది.ఎట్టకేలకు బ్యాంక్ మేనేజర్ హామీ ఇవ్వడంతో పోలీసులు,అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.అంతే కాకుండా గత నెలలో జిల్లా కేంద్రంలోని ఓ బ్యాంక్ లో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరువక ముందే మళ్ళీ ఏం జరుగుతుందో అని భయందోలనకు గుర్యారు.