కూతురి పెరు తీయండి అంటే అల్లుడు పెరు యాడ్ చేసారు

కొత్త రేషన్ కార్డ్ లతో కొత్త తిప్పలు;

By :  Ck News Tv
Update: 2025-04-03 03:19 GMT

*కూతురి పెరు తీయండి అంటే అల్లుడు పెరు యాడ్ చేసారు*

*కొత్త రేషన్ కార్డ్ లతో కొత్త తిప్పలు*

అర్హుడైన ప్రతి కార్డుదారునికి సన్న బియ్యం అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ పథకంపై మెజారిటీ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కొందరు అధికారుల నిర్లక్ష్యం మూలంగా అర్హులైన వారికి లబ్ధి జరగడం లేదు.

నర్సంపేట నియోజకవర్గంలో ఈ మేరకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నర్సంపేట మండలంలోని నర్సింగపురం, ఇటుకాలపల్లి, ఇప్పల్ తండా సహా పలు గ్రామాల్లోనే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు అర్హులైన కార్డుదారులు రేషన్ డీలర్ల వద్దకు వచ్చి మెజారిటీ సభ్యులు మొర పెట్టుకుంటున్నట్లు సమాచారం.

ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య. దాదాపుగా ఏడెనిమిది ఏండ్ల కిందట పెళ్లి అయిన వాళ్లు నేటికీ కొత్త రేషన్ కార్డుల కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతనంగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా సర్వేలు చేసి అర్హులను గుర్తించారు. సర్వే అనంతరం గ్రామ సభల్లో అర్హుల జాబితాలను వెల్లడించడంతో పాటుగా అప్పటికీ దరఖాస్తు చేసుకోని వారి కోసం మరొకసారి దరఖాస్తులను స్వీకరించారు. వీటిని సైతం రెవెన్యూ కార్యాలయానికి తరలించారు. కొత్త కార్డుల కోసం ఇప్పటికే ఉన్న కార్డుల్లో నుండి పేర్లు తొలగించుకున్న వారికి నిరాశే ఎదురైంది.

అత్తమామ కార్డుల్లో అల్లుళ్లు

నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈసారైనా తమ కోరిక తీరుతుందని ఆశించగా నిరాశే ఎదురైంది. ప్రస్తుతం డివిజన్ వ్యాప్తంగా కొత్తగా వచ్చిన కార్డులు చాలా తక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరి పేర్లు తమ అత్తగారి కార్డుల్లో నమోదైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా ఒక రేషన్ కార్డులో ఒకే ఇంటి పేరుతో పేర్లు ఉంటాయి. కొత్తగా వచ్చిన పేర్ల యాడింగ్ వల్ల రెండు ఇంటి పేర్లు ఒకే కార్డులో ఉండటం గమనార్హం.

నర్సంపేట మండలంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉన్నట్లు క్షేత్రస్థాయిలో పరిశీలించగా తెలుస్తోంది. మరోవైపు ఇద్దరు పిల్లలతో కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త కార్డు రాకపోగా వీరి ఇద్దరు పిల్లల పేర్లు వారి నానమ్మ కార్డులో చేరడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని గ్రామాల వారీగా కార్డు రాని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ శాఖ వెంటనే స్పందించి కార్డుదారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

సర్వే చేసిన వారికి నేటికీ అందని నగదు

గ్రామస్థాయిలో సర్వే కోసం నర్సంపేట మండలంలో ఏర్పాట్లు చేశారు. ఇటీవల కొన్ని గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం అయిన సంగతి తెలిసిందే. అప్పటి 27 గ్రామాల్లో ఈ సర్వే కోసం ఎన్యుమరేటర్లను తీసుకున్నారు. వీరిలో ఉద్యోగులు 25 మంది కాగా, విద్యార్థులను 56 మందిని తీసుకున్నారు. వీరికి రూ.10 వేల పారితోషికంతో పనులు చేపట్టారు.

వీరి సాయంతో ఆన్లైన్ ఎంట్రీ సైతం చేయించారు. వీరికి ఇస్తామన్న భృతి నేటికీ ఇవ్వలేదు. నర్సంపేట పట్టణంలో చేసిన వారికి మున్సిపాలిటీ నుండి భృతి చెల్లించినప్పటికీ రూరల్ లో చేసిన వారికి నేటికీ మొండి చెయ్యి చూపారు. వీరికి మొత్తంగా రూ. 4 లక్షలు రావాల్సి ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. పారితోషకం కోసం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ నేటికీ తిరుగుతూ ఉండటం గమనార్హం.

Similar News