HyderabadPoliticalTelangana

తెలంగాణ పోలీసులకు కేటీఆర్‌ వార్నింగ్‌

తెలంగాణ పోలీసులకు కేటీఆర్‌ వార్నింగ్‌

సెటిల్మెంట్లకు అడ్డాగా పోలీస్ స్టేషన్లు

తెలంగాణలో పోలీసులకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చారు. తెలంగాణలో పోలీసు స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారుతున్నాయని కేటీఆర్‌ ఆరోపించారు.

తన భూమిని కాంగ్రెస్ నేత కబ్జా చేశాడని ఫిర్యాదు చేస్తే ఉల్టా తమ పార్టీ నేత కర్కబోయిన కుంటయ్యపైనే కేసు బనాయించి వేధించడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. సివిల్ మ్యాటర్‌లో పోలీసులు దూరి సెటిల్‌మెంట్లు, అరాచకాలు చేయడం సమాజానికి ఎంతమాత్రం మంచిది కాదన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్య భౌతికకాయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు.

ఆ తరువాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ నాయకులు ఏం చేప్తే అది చేయడాన్నే డ్యూటీగా భావించి పోలీసులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కుంటయ్య చావుకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకునే వరకు న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ఎవరిని వదిలిపెట్టమన్నారు. తాము అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో బిఆర్ఎస్ నేతలు ఎవరూ కూడా ఇంత చిల్లర, లేకి పనులు చేయలేదన్నారు.

మొన్న ఏసీబీ విచారణ జరుగుతున్నప్పుడు తన కోసం హైదరాబాద్ దాకా వచ్చి ధైర్యం చెప్పిన కుంటయ్య అదే రోజు రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి మనసు కకావికలమైందన్నారు కేటీఆర్.

రాజకీయ నాయకులు అంటే అందరూ ఏదేదో ఊహించుకుంటారన్న కేటీఆర్, బయటికి గంభీరంగా కనపడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని ఓ వైపు ప్రజల కోసం పనిచేస్తూ మరోవైపు కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురవుతారన్నారు.

తన భూమిని కాంగ్రెస్ నేత కబ్జా చేయడం, పోలీసులు కూడా ఆయనకే వత్తాసు పలకడంతో కుంటయ్య ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే పార్టీ నేతలను పంపి ఆయనను కాపాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు.

పార్టీలో నిబద్దత కల నాయకుడు, నిఖార్సైన గులాబీ సైనికుడు కుంటయ్య ఇద్దరు పిల్లల చదువులు, వారి పెళ్లిళ్లు , ఇతర సమస్యలు అన్నింటికీ తనదే బాధ్యత అన్నారు కేటీఆర్. కుంటయ్య కుటుంబానికి పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామి ఇచ్చారు.

ఈరోజు కుంటయ్యకి జరిగింది రేపు మరొకరికి జరగొచ్చన్న కేటీఆర్, ఈ అరాచకాలను ప్రభుత్వం అదుపు చేయాలన్నారు. ఈ ఆపద సమయంలో కుంటయ్య కుటుంబానికి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నారు.

పెద్దకర్మ జరిగేదాకా పార్టీ జిల్లా నాయకత్వమే అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటుందన్నారు. కుంటయ్య ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని కేటీఆర్ ప్రార్థించారు.

అసలేం జరిగిందంటే..?

‘కాంగ్రెస్‌ నాయకుడు రూ.10 లక్షల విలువైన నా భూమి కబ్జా చేసిండు.. సీఐ, ఎస్సైకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఉల్టా నా మీద నే కేసు పెట్టిన్రు. ఇప్పుడు నాకు ప్లాటు లేదు.. నా బిడ్డ పెండ్లికి ఏమీ మిగల్లేదు. నా చావుకు కాంగ్రెస్‌ నాయకులే కారణం.

నా కుటుంబాన్ని ఆదుకో కేటీఆర్‌ అన్నా’ అంటూ లేఖ రాసి మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్య సోమవారం గడ్డిమందు తాగగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కుంటయ్యకు భార్య విజయ, కూతుళ్లు భార్గవి (22), దీక్షిత(11) ఉన్నారు.

2019లో ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం కేటీఆర్‌ ఏసీబీ విచారణకు హాజరైన సందర్భంగా మద్దతుగా స్థానిక నేతలతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లారు. సోమవారం రాత్రి వరకు కుంటయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కుంటయ్య సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా లోకేషన్‌ గుర్తించారు. మంగళవారం తెల్లవారుజామున గ్రామశివారులోని పొలం వద్ద అపస్మారకస్థితిలో పడి ఉన్న కుంటయ్యను కుటుంబసభ్యులు సిరిసిల్లలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

సమాచారం అందుకున్న బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాయకులు గజభీంకార్‌ రాజన్న, అక్కరాజు శ్రీనివాస్‌, అడ్డగట్ల భాస్కర్‌ తదితరులు దవాఖానకు చేరుకుని కుంటయ్యను పరామర్శించారు.

కేటీఆర్‌ సూచనతో మెరుగైన వైద్యం కోసం ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించగా, చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతిచెందాడు. తన కూతురు పెండ్లికోసం కొనుగోలు చేసిన భూమిని కబ్జాచేసి తంగళ్లపల్లికి చెందిన గంగ కృష్ణారెడ్డి, మల్యాల నాగరాజు అనే వ్యక్తులు తనను చాలా ఇబ్బందులకు గురి చేసినట్టు కుంటయ్య లేఖలో ప్రస్తావించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button