Telangana
Trending

నేను కూడా రేపు టీవీ ఛానల్ పెట్టొచ్చు

నేను కూడా రేపు టీవీ ఛానల్ పెట్టొచ్చు

మోహన్‌బాబు మరో ఆడియో విడుదల.. నిజ జీవితంలో నటించాల్సిన అవసరం లేదు!

హైదరాబాద్‌: తాను జర్నలిస్ట్‌ను కొట్టాలని దైవసాక్షిగా అనుకోలేదని సినీ నటుడు మోహన్‌బాబు (Mohan babu) అన్నారు. ఈ మేరకు గురువారం ఓ ఆడియో ప్రకటన విడుదల చేశారు.

తన ఇంట్లోకి దూసుకొచ్చేది జర్నలిస్టులా కాదా? అన్న విషయం తనకు తెలియదన్నారు. జరిగిన ఘటన పట్ల చింతిస్తున్నట్లు ప్రకటించారు.

”కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా? ప్రజలు, రాజకీయ నాయకులు ఆలోచించాలి. మీడియా వారిపై దాడి చేయాలని దైవసాక్షిగా అనుకోలేదు. నా ఇంట్లోకి దూసుకొచ్చేవాళ్లు మీడియా వాళ్లా? ఇంకా ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు. మీడియాను అడ్డుపెట్టుకొని నాపై దాడి చేసే అవకాశం ఉందని ఆలోచించా. చీకట్లో ఘర్షణ జరిగింది. నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలింది. మీడియా ప్రతినిధికి తగిలిన దెబ్బకు నేను బాధపడుతున్నాను. ఆ మీడియా ప్రతినిధి నాకు తమ్ముడి లాంటివాడు. అతని భార్యాబిడ్డల గురించి ఆలోచించా. నా బాధ గురించి ఎవరూ ఆలోచించలేదు. నేను సినిమాల్లో నటిస్తాను తప్ప నిజ జీవితంలో నటించాల్సిన అవసరం నాకు లేదు”

”నాకున్న ఒక్కటే ధైర్యం.. సాహసం. నీతిగా, ధర్మంగా బతకాలన్నదే నా ఆలోచన. గేటు బయట అసభ్యకరంగా ప్రవర్తించి కొట్టి ఉంటే నాపై 50 కేసులు పెట్టుకోవచ్చు, నన్ను అరెస్టు చేసుకోవచ్చు. నేనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అరెస్టు అయ్యే వాణ్ని నా ఇంట్లోకి వచ్చి నా ఏకాగ్రతను, ప్రశాంతతను భగ్నం చేశారు. నా బిడ్డే నా ప్రశాంతతను చెడగొడుతున్నాడు. మేం కూర్చొని మాట్లాడుకుంటాం. ఏదో ఒక రోజు మా సమస్య పరిష్కారం అవుతుంది. కుటుంబసభ్యుల గొడవకు మధ్యవర్తులు అవసరం లేదు. నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. అవన్నీ మరిచిపోయి నేను కొట్టిన విషయం ప్రస్తావిస్తున్నారు. నేను కొట్టిన విషయం తప్పే, కానీ ఏ సందర్భంలో కొట్టానో ఆలోచించాలి. మీకు టీవీలు ఉండొచ్చు, నేను కూడా రేపు టీవీ పెట్టొచ్చు. నేను మీడియా ప్రతినిధిని కొట్టినందుకు చింతిస్తున్నాను. నేను కొట్టింది వాస్తవమే, అసత్యం కాదు” అని మోహన్‌బాబు అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button