
ఎరువుల కట్టకు కాంబినేషన్ కత్తి..!
కాంబినేషన్ విక్రయాలపై కన్నెత్తని అధికారులు..?
ఎరువుల దుకాణాలతో వ్యవసాయ అధికారులు కుమ్మక్కయ్యారా?
ఎరువుల విక్రయంలో ఇష్టారాజ్యం..?
కాంబినేషన్ కొనకపోతే రూ.100 అదనం..!
బిల్లులో ప్రభుత్వ ధర… చేతిలో మాత్రం అదనపు వసూళ్లు?
తూతూ మంత్రం తనిఖీలు.. ఫోటోలకే పరిమితం..?
సీకే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జూలై 27 2026: ఏన్కూరు మండలంలోని కొన్ని ఎరువులు, పురుగుల మందుల దుకాణాల్లో రైతులపై కాంబినేషన్ విక్రయాల పేరుతో అదనపు భారం మోపుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎరువుల కట్ట కొనుగోలు చేయాలంటే అవసరం లేని పురుగుల మందులు లేదా ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కూడా తప్పనిసరిగా కొనుగోలు చేయాలని దుకాణదారులు ఒత్తిడి చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.
కాంబినేషన్‌లో ఇతర ఉత్పత్తులు కొనడానికి నిరాకరిస్తే ఒక్కో ఎరువు కట్టపై అదనంగా ₹100 వరకు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పెరిగిన సాగు ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న తమపై ఇది మరింత ఆర్థిక భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతులు మరో కీలక ఆరోపణ కూడా చేస్తున్నారు. బిల్లులో మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పీ (MRP) ధరనే నమోదు చేసి, నగదు చెల్లించే సమయంలో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. దీంతో అధికారికంగా బిల్లులో ఎలాంటి అక్రమం కనిపించకపోయినా, రైతుల నుంచి అదనపు మొత్తం వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిల్లు ఒక ధరకు ఉండగా, చేతిలో మాత్రం ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు.
ఈ అంశంపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు సమర్థవంతంగా స్పందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ తనిఖీలు మాత్రం కేవలం పేరుకే జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు.
వ్యవసాయ శాఖ అధికారులు దుకాణాలకు వెళ్లి ఫోటోలు దిగడం, పై అధికారులకు నివేదికలు పంపడం మినహా వాస్తవ పరిస్థితులను పరిశీలించడం లేదని రైతులు అంటున్నారు. రైతుల వద్ద ఉన్న బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించి, బిల్లులో నమోదైన ధరకు వాస్తవంగా చెల్లించిన మొత్తాన్ని సరిపోల్చడం, రైతుల వాంగ్మూలాలు నమోదు చేయడం, కాంబినేషన్ విక్రయాలపై విచారణ చేపట్టడం, నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలపై చర్యలు తీసుకోవడం వంటి అంశాలు కనిపించడం లేదని వారు పేర్కొంటున్నారు.
“తనిఖీలు రైతుల కోసం చేస్తున్నారా… లేక ఫోటోల కోసం చేస్తున్నారా?” అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ అధికారులు, ఎరువుల దుకాణాల యజమానుల మధ్య కుమ్మక్కు ఉందనే అనుమానాలు కూడా రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాల్సి ఉండగా, బిల్లులో ఒక ధర చూపించి, రైతుల నుంచి అదనపు నగదు వసూలు చేయడం, బలవంతపు కాంబినేషన్ విక్రయాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లా వ్యవసాయ అధికారులు వెంటనే మండలంలోని అన్ని ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, రైతుల నుంచి వాస్తవంగా ఎంత మొత్తం వసూలు చేస్తున్నారనే విషయంపై విచారణ జరిపి, అక్రమాలు రుజువైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.




