CinemaHyderabad

కుబేర'కు అదే తొలి విజయం..

కుబేర'కు అదే తొలి విజయం..

‘కుబేర’కు అదే తొలి విజయం..

‘కుబేర’ కు ప్రేక్షకాదరణ దక్కిన సందర్భంగా చిత్ర బృందం సక్సెస్‌ మీట్‌ను ఆదివారం నిర్వహించింది.
చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధనుష్‌ , నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో దర్శకుడు శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలైన సంగతి తెలిసిందే.

వేడుకనుద్దేశించి చిరంజీవి మాట్లాడుతూ.. ”ఇది నా సక్సెస్‌ మీట్‌లా అనిపిస్తోంది. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్నవారంతా నాకు పరిచయం ఉన్నవారే. విభిన్న పాత్ర పోషించానంటూ నాగార్జున గతంలోనే నాకు ‘కుబేర’ గురించి చెప్పాడు. ధనుష్‌ హీరో అని తెలిపాడు.

తనకు ఎలాంటి విజయాన్ని అయితే అందిస్తుందని చెప్పాడో.. ఇప్పుడు అది అందుకున్నాడు. ఎవరైనా హీరోగానే నటిస్తానని అనుకోవడం కరెక్ట్‌ కాదు. ఈ కథలో నాగార్జునను శేఖర్‌ ఊహించుకోవడం, అందుకు నాగ్‌ అంగీకరించడమే ఈ సినిమాకి తొలి విజయం అనుకుంటున్నా.

ఓ సన్నివేశంలో బెగ్గర్‌ పాత్రలో ఉన్న ధనుష్‌ని నేను గుర్తించలేకపోయా. అంతగా ఆ పాత్రలో లీనమయ్యాడు. వాస్తవ సంఘటనలను చూస్తున్నట్టు అనిపించింది గానీ సినిమాలాగా అనిపించలేదు.

శేఖర్‌ కమ్ముల తెరకెక్కించింది పది సినిమాలే అయినా.. ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. దర్శకుడిగా 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల నన్ను కలిశాడు. ఓ సినిమా చిత్రీకరణలో నన్ను తొలిసారిగా చూశానంటూ నాటి జ్ఞాపకాలు గుర్తుచేశాడు.

అప్పుడు అక్కడున్న వారిలో అతడే ఎత్తుగా ఉన్నాడు కాబట్టి నేను పిలిచి ఉంటా. దర్శకుడిని కావాలని అతడు ఆ రోజే నిర్ణయించుకోవడం నాకు గర్వంగా ఉంది. అతడి సినిమాలన్నీ వాస్తవానికి దగ్గరగా ఉంటాయి” అని పేర్కొన్నారు.

చిరంజీవి లక్కీ ఛార్మ్‌: శేఖర్‌ కమ్ముల

”చిరంజీవి నా లక్కీ ఛార్మ్‌ అయిపోయారు. వేడుకకు వచ్చినందుకు థాంక్స్‌ సర్‌. కాలేజీ రోజుల్లో మిమ్మల్ని కలిశా. అప్పుడు మీరిచ్చిన షేక్‌హ్యాండ్‌ ఇప్పటికీ గుర్తుంది. ఎప్పటికైనా మీతో సినిమా తీయాలన్న కల ఉందని ఇటీవల మిమ్మల్ని కలిసినప్పుడు చెప్పా. మీరు నాకెంతో క్లోజ్‌ అనిపిస్తుంటుంది” అని శేఖర్‌ చెప్పారు.

”ఇలాంటి విభిన్న కాన్సెప్టును ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారోనన్న సందేహం ఉండేది. కానీ, ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోతో నా అనుమానాలన్నీ తొలగిపోయాయి. ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

మీ రుణం తీర్చుకోలేనిది. మీ ఆదరణే ఇలాంటి ఎన్నో చిత్రాలు తెరకెక్కించేందుకు ధైర్యాన్ని ఇస్తుంది. ఎప్పుడూ సపోర్ట్‌ చేసే మీడియాకు థాంక్స్‌.

ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్‌ను ఎందుకు ఎంపిక చేశారోనని చాలామంది అనుకున్నారు. ఆయనతో కలిసి వర్క్‌ చేయాలని అందరికీ ఉంటుంది. మేం గతంలోనే కలిసి పని చేయాల్సి ఉంది. ప్రతి సన్నివేశాన్ని ఒకే సమయంలో తెలుగు, తమిళ్‌లో షూట్‌ చేశాం.

‘కుర్రాడు బాగా నటించాడు’ అని నాగార్జునపై మా అమ్మ ప్రశంసలు కురిపించింది. ధనుష్‌ నటననూ మెచ్చుకుంది. అందరూ సినిమా నిడివి ఎక్కువ అయిందని అంటున్నారు. మా అమ్మ మాత్రం ‘మరో 10 నిమిషాలు ఉంటే బాగుండేది’ అని చెప్పింది.

‘కుబేర’ విషయంలో నో డౌట్స్‌: రష్మిక

”నా సినీ జీవితంలో చిరంజీవి భాగమయ్యారు .ఆమె నటించిన పలు సినిమాల వేడుకలకు రావడాన్ని ఉద్దేశిస్తూ. ఏదైనా చిత్రాన్ని అంగీకరించే ముందుకు చాలా సందేహాలు ఉంటాయి. కానీ, ‘కుబేర’ విషయంలో అలాంటిదేం లేదు. దర్శకుడు ఎలా చెబితే అలా సమీర పాత్ర పోషించా.

ఇలాంటి రోల్‌ నాకు దక్కినందుకు నాకే ఆశ్చర్యంగా ఉంది. నటిగా నన్ను మరో మెట్టు ఎక్కించిన చిత్రమిది. శేఖర్‌, నాగార్జున, ధనుష్‌, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌.. ఈ సినిమాకి మూల స్తంభాల్లాంటి వారు” అని రష్మిక ప్రశంసించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button