
అడిగిన చోట బస్సు ఆపలేదని కండక్టర్‌పై దాడి
ఆర్టీసీ డ్రైవర్లు సాధారణంగా బస్సులను బస్‌స్టాప్ దగ్గర ఆపుతుంటారని తెలిసిందే. అయితే కొన్ని సార్లు బస్‌స్టాప్ లేకున్నా ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు చేయి పైకెత్తితే బస్ స్టాప్ లేని చోట కూడా బస్సు ఆపి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తుంటారు.
కొన్ని సార్లు మాత్రం డ్రైవర్లు ఎవరినీ లెక్కచేయకుండా వెళ్లిపోతుంటారు. ఓ ప్రయాణికుడు తాను అడిగిన చోట బస్సు ఆపలేదని కండక్టర్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ -అల్వాల్ పరిధిలో చోటుచేసుకుంది.
మురళీ సింగ్ అనే ప్రయాణికుడు హైదరాబాద్ -అల్వాల్ ప్రాంతంలో కంటోన్మెంట్ డిపోకు చెందిన 23T బస్సులో ప్రయాణిస్తూ.. తాను అడిగిన చోట బస్సు ఆపలేదని బస్సు కండక్టర్‌పై కడెంతో దాడి చేశాడు.
ఇద్దరి మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరడంతో తన చేతికున్న కడియంతో కండక్టర్ ను ఘోరంగా గాయపరిచాడు తాగుబోతు. ఈ క్రమంలో కండక్టర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో బస్సులోని ఇతర ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ 100 కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. డ్రైవర్ ఫిర్యాదుతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తాగుబోతును అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.



