
ఇన్సూరెన్స్ ప్రాముఖ్యతను చాటి చెప్పిన ఘటన
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ స్పందనకు కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు
సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు ఏప్రిల్ 20 2026: మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో నరేందర్ రెడ్డి కుటుంబానికి రూ.2 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాన్ని త్వరితగతిన అందజేశారు. కుటుంబానికి కీలకమైన ఈ ఆర్థిక సహాయాన్ని ఆయన భార్య పావని స్వీకరించారు.
నరేందర్ రెడ్డి మరణానంతరం కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, బ్యాంక్ అధికారులు వెంటనే స్పందించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియను వేగవంతం చేశారు. బ్యాంక్ మేనేజర్ కె.వి. ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షణలో, అకౌంటెంట్ బి. ఉపేందర్ ప్రత్యేక చొరవ తీసుకుని అవసరమైన పత్రాల పరిశీలన, ధృవీకరణ వంటి ప్రక్రియలను త్వరగా పూర్తి చేసి, కుటుంబానికి తక్షణ సాయం అందేలా చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్న కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్లు పి. సుమంత్, బి. రాధాకృష్ణ, సి.ఎస్.ఏ బి. తిరుమల, కృష్ణవేణి, ఓ.ఏ రామారావు తదితర బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. వారు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, భవిష్యత్తులో బ్యాంక్ ద్వారా అందుబాటులో ఉన్న పథకాలపై వివరాలు తెలియజేశారు.
ఈ ఆర్థిక సాయం అందిన సందర్భంగా నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు బ్యాంక్ అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. క్లిష్ట సమయంలో బ్యాంక్ వేగంగా స్పందించి సహాయం అందించడం తమకు ఎంతో ఊరటనిచ్చిందని పేర్కొన్నారు.
అకౌంటెంట్ బి. ఉపేందర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ కుటుంబ భద్రత కోసం ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం ఎంతో అవసరమని సూచించారు. అనుకోని పరిస్థితుల్లో ఇలాంటి పథకాలు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా, జీవనోపాధిని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు.
బ్యాంక్ అధికారులు కూడా ప్రజల్లో ఇన్సూరెన్స్ పథకాలపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సమయానికి సేవలు అందిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక భద్రతను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.




