
వారం రోజుల్లో పెళ్లి.. బావిలో శవమై తేలిన పెళ్లికూతురు
మరిపెడ : వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి కోసం ఇరు కుటుంబాలతో పోరాడి ఆత్మహత్యాయత్నం చేసి చివరకు పెద్దలను ఒప్పించారు..
ఇద్దరి కుటుంబాలు ఒప్పుకొని ఈనెల 29వ తారీఖున పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు. ఇంతలోనే ఇంట్లో విషాదం.. మరో వారం రోజుల్లో పెళ్లి ఉందనగా తండా సమీపంలో ఓ వ్యవసాయ క్షేత్రంలోని బావిలో అనుమానాస్పద స్థితిలో యువతి శవమైంది.
ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఇటుకల గడ్డ తండాలో బుధవారం జరిగింది. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇటుకల గడ్డ తండాకు చెందిన భూక్య వెంకన్న వినోదల కుమార్తె భూక్య సంగీత (20), కొత్త తండాకు చెందిన అజ్మీరా గోవిందు కుమారుడు అజ్మీర అరవింద్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ఈ విషయమై తల్లిదండ్రులను ఒప్పించేందుకు గతంలో సంగీత పురుగుల మందు కూడా తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో చేసేది లేక పెద్దలు పెళ్లికి అంగీకరించి ఈ నెల 29వ తేదీన ముహూర్తం ఖరారు చేశారు.
కాగా మంగళవారం సాయంత్రం ప్రియుడి ఇంట్లో ఓ శుభకార్యముండగా సంగీత కుటుంబాన్ని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే వారు గోవింద్ ఇంటికి వెళ్ళగా.. ప్రియుడు అరవింద్ యువతి వద్దకు వచ్చి తీసుకుని వెళ్ళినట్లుగా తెలుస్తోంది.
అనంతరం సంగీత బుధవారం ఉదయం ఇటుకల గడ్డ తండా సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో పడి చనిపోయినట్లుగా స్థానికులు తెలిపారు. అయితే బావి సమీపంలో రక్తం మరకలతో కూడిన చెప్పులు ఉండడంతో యువతి మృతి పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ జరుపుతున్నారు.



