
గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు హఠాన్మరణం
బూర్గంపాడు మండల పరిధిలోని అంజనాపురం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. సొంత గ్రామంలోనే ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న సపావట్ శంకర్(47) సోమవారం ఉదయం తన వ్యవసాయ పొలంలో పనిచేస్తుండగా గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు.
స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్ ఇటీవల కాలం వరకు మోరంపల్లిబంజర్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఆయన తన స్వగ్రామమైన అంజనాపురం పాఠశాలకే బదిలీపై వచ్చారు.
ఈ క్రమంలో ఈరోజు ఉదయాన్నే మోరంపల్లిబంజర్ గ్రామంలో టిఫిన్ చేసిన శంకర్, పాఠశాల ప్రారంభ సమయానికి సమయం ఉండటంతో, ఆలోపు తన పొలంలో వరి నారు చల్లేందుకు విత్తనాలు తీసుకుని వెళ్లారు.
అయితే, పొలంలో పనులు చేసుకుంటున్న సమయంలోనే ఆయనకు అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన పొలంలోనే కుప్పకూలి హఠాన్మరణం చెందారు.
మృతుడు శంకర్‌కు భార్య శరణ్య, ఇంటర్ చదువుతున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిన్నటివరకు తమతో ఎంతో యాక్టివ్‌గా ఉన్న శంకర్ ఇలా గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
శంకర్ మృతితో అంజనాపురం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. శంకర్ అకాల మరణం పట్ల పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, తోటి ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.




