
వృద్ధురాలి డెడ్‌బాడీపై బంగారు కమ్మలు మాయం..జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్లో ఘటన
అనారోగ్యంతో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయిన వృ-ద్ధురాలి చెవి కమ్మలు మాయం అయ్యాయి. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే… కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన తాండ్రల బాలవ్వ శ్వాసకోశ సమస్యతో బాధపడుతుండంతో కుటుంబ సభ్యులు జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. క్రిటికల్ కేర్ యూనిట్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ గురువారం ఉదయం బాలవ్వ చనిపోయింది.
దీంతో కుటుంబసభ్యులు వృద్ధురాలి డెడ్‌బాడీని ఇంటికి తీసుకెళ్లి పరిశీలించగా.. చెవులకు ఉండాల్సిన పావు తులం బంగారు కమ్మలు కనిపించలేదు. హాస్పిటల్లో చేర్పించే సమయానికి ఉన్న కమ్మలు..
ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కనిపించకపోవడంతో హాస్పిటల్ సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తూ వారితో గొడవకు దిగారు. మృతురాలి అల్లుడు గాండ్ర శంకర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు.




