
కవిత పార్టీలోకి వలసలు.. టీఆర్ఎస్లోకి మాజీ మంత్రి, త్వరలోనే అనుచరులతో చేరిక
కొత్తగా కల్వకుంట్ల కవిత ప్రారంభించిన పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరుతో పార్టీ ప్రారంభించిన కవితకు.. తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే పార్టీ ప్రారంభించడానికి ముందే బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు.. కవితకు మద్దతు తెలిపారు.
ఈ క్రమంలోనే తాజాగా మరో మాజీ మంత్రి బోడ జనార్దన్.. కల్వకుంట్ల కవితతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తన అనుచరులతో కలిసి అతి త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు బోడ జనార్ధన్ స్పష్టం చేశారు.
శుక్రవారం రోజున హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ నేత బోడ జనార్ధన్ కీలక చర్చలు జరిపారు.
త్వరలోనే తన ఫ్యాన్స్, మద్దతుదారులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని బోడ జనార్ధన్ పేర్కొన్నారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుంచి బోడ జనార్దన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా బోడ జనార్థన్ పని చేశారు.
సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో తెలంగాణ రక్షణ సేన పార్టీని బలోపేతం చేయడానికి.. టీఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు తన వంతు కృషి చేస్తానని బోడ జనార్థన్ తెలిపారు.
సీనియర్ నేత అయిన బోడ జనార్థన్ టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీకి కొత్త ఉత్సాహం రానుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన బోడ జనార్దన్..
ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో ఉన్న చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున కీలక వ్యక్తిగా ఎదిగారు. రాజకీయాల్లో అనుభవం ఉన్న నేతగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతుండటంపై ఆ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.




