
‘మా పదవుల మాటేంటి సార్?’.. టీజేఎస్‌లో నామినేటెడ్ సెగ!
ఇటీవల ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం నియమితులైన తర్వాత తమకూ నామినేటెడ్ పోస్టులు ఇప్పించాలని ఆయనపై తెలంగాణ జనసమితి(టీజేఎస్) కేడర్ నుంచి ఒత్తిడి పెరుగుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోదండరాం సైతం కాంగ్రెస్, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీజేఎస్.. కాంగ్రెస్ కు మిత్రపక్షంగా వ్యవహరించింది.
ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున టీజేఎస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ ఎన్నికల సందర్భంగా తమకు కాంగ్రెస్ రెండు ఎమ్మెల్సీ, ఐదు కార్పొరేషన్ చైర్మన్లు, నాలుగు జెడ్పీ చైర్మన్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చినట్టు టీజేఎస్ వర్గాలు గుర్తుచేశారు.
వాటిలో ప్రధానంగా ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ, టీజేఎస్ కీలక నేత ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావుకు తెలంగాణ విద్యాకమిషన్ సభ్యుడిగా అవకాశమిచ్చారు. ప్రధానంగా టీజేఎస్ లో కీలకంగా వ్యవహరిస్తున్న విద్యార్థి, యువనేతలు కొందరు నామినేటెడ్ పోస్టుల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోదంరాంను గట్టిగా కోరుతున్నట్టు సమాచారం.
తాము తెలంగాణ ఉద్యమంలో ఓయూలో కీలకంగా పోరాడమని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం శ్రమించామని, ప్రభుత్వం నుంచి తమకు సరైన గుర్తింపు ఇవ్వాలని అడుగుతున్నారు.
వారితో పాటు కొందరు సీనియర్ నేతలు సైతం తమకు నామినేటెడ్ పోస్టుల్లో తమ పేర్లను పరిశీలించాలని అధినాయకత్వాన్ని కోరుతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల తరుచూ టీపీసీసీ చీఫ్సైతం నామినేటెడ్ పోస్టుల బర్తీ అంశాన్ని కొలిక్కి తీసుకొస్తున్నట్టు చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ.. తెలంగాణ జనసమితి పార్టీ కాంగ్రెస్ కి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నది. కోదండరాం కాంగ్రెస్ కు మద్దతుగా, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి ఉద్యమించారు.
టీజేఎస్ రాజకీయంగా తెలంగాణలో తమకంటూ ప్రాధాన్యం ఉండాలని కోరుకుంటున్నట్టు తాజాగా ఎమ్మెల్సీ కోదండరాం వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతున్నది. అసెంబ్లీ ఎన్నికల కోసం తాము కొన్ని నియోజకవర్గాలను ఎంచుకుని పార్టీ కోసం పనిచేయాలని అనుకుంటున్నట్టు ఆయన తెలిపారు.
కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీజేఎస్, కాంగ్రెస్ కూటమి 8సీట్లలో పోటీచేయగా వాటిలో నాలుగు కూటమి తరఫున వర్ధన్నపేట, సిద్దిపేట, అంబర్ పేట, మల్కాజ్ గిరిలో పోటీచేసింది. ఫ్రెండ్లీ కాంటెస్ట్ లో భాగంగా వరంగల్ ఈస్ట్, దుబ్బాక, ఖానాపూర్, స్టేషన్ ఘనపూర్ లో పోటీచేసినట్టు పార్టీవర్గాలు తెలిపాయి. వీటిల్లో ఏ స్థానంలోనూ టీజేఎస్ విజయం సాధించలేదు.
ప్రస్తుతం ఐదు అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసేందుకు టీజేఎస్ నాయకులు సిద్ధమవుతున్నట్టు టీజేఎస్ నేతలు తెలిపారు. దీంతో టీజేఎస్.. కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉంటూనే తమ సొంత బలాన్ని కూడా పెంచుకునే ప్రయత్నాలను చేస్తున్నదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
సమస్యలపై పోరాటం.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో టీజేఎసీ చైర్మన్ గా కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉంటూనే ప్రజా సమస్యలపై పోరాడి పరిష్కారానికి చొరవ తీసుకోవాలనే అభిప్రాయంలో పార్టీవర్గాలు ఉన్నట్టు తెలిసింది.
ఇటీవల రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు, యువత, నిరుద్యోగ, తెలంగాణ ఉద్యమకారులు సమస్యలు, సింగరేణి, ప్రైవేట్, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు, వ్యవసాయ సంబంధిత అంశాలపై ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో గతంలోనే పార్టీ విస్తృతస్థాయి సమావేశాల్లో తీర్మానలు చేసినట్టు టీజేఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ సమస్యలపైన కమిటీలు వేశామని, సమగ్ర నివేదికలు తయారుచేసి సీఎం రేవంత్ రెడ్డిని కలవాలనే ప్రయత్నాలు కూడా చేస్తామని జనసమితి నేతలు చెబుతున్నారు.



