
లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్
web desc : ఖైరతాబాద్ జోన్ పరిధిలోని జీహెచ్ఎంసీ సర్కిల్-37 (బోరబండ)లో ఏసీబీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించి రూ.లక్ష లంచం తీసుకుంటున్న జూనియర్ అసిస్టెంట్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఏసీబీ సిటీ రేంజ్-1 అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక బాధితుడు ఇంటి నిర్మాణ అనుమతికి సంబంధించిన ఫైల్ను మీ సేవా నుంచి పూర్తిగా ప్రాసెస్ చేశాక జూనియర్ అసిస్టెంట్ బి.శ్రీలతను ఆశ్రయించారు.
ఇందుకుగాను ఆమె మొత్తం రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేశారు. దీనిపై బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు పక్కాగా వ్యూహం రచించారు.
సోమవారం మొదటి విడతగా రూ.లక్ష యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ సమీపంలోని రత్నదీప్ వద్ద బాధితుడి నుంచి శ్రీలత తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకుని కేసు నమోదు చేశారు.
అనంతరం నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక జడ్జి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆమెకు జ్యుడీషియల్ రిమాండ్ విధించి జైలుకు తరలించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు సూచించారు. లేదా వాట్సప్ (9440446106), ఫేస్బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్టు చెప్పారు.



