
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రాజ్యమేలుతున్న దళారులు
Web desc : ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అంతం చేసేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రస్తుతం అక్రమాలకు అడ్డాగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక్కడ అధికారుల అండదండలతో దళారుల వ్యవస్థ వేళ్లూనుకుపోయిందని, సామాన్య ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేలల్లో వసూళ్లు… ముఖ్యంగా వివాహ రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే అమాయక ప్రజలే లక్ష్యంగా ఈ దళారీ వ్యవస్థ నడుస్తోంది.పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం వచ్చే వారి వద్ద నుండి బయట వ్యక్తులు రూ.4 వేల నుండి రూ. 10 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన ఫీజు కంటే ఐదారు రెట్లు అదనంగా వసూలు చేస్తున్నా అడిగే నాథుడే కరువయ్యారు. కార్యాలయం బయటే తిష్టవేసే కొందరు వ్యక్తులు, అధికారులతో తమకున్న పరిచయాలను ఆసరాగా చేసుకుని ఈ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.
ఏసీబీ దాడులు జరిగినా.. మారని తీరు. గతంలో ఇదే కార్యాలయంలో అక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.
ఆ సమయంలో భారీగా అక్రమాలు జరిగినట్లు గుర్తించిన అధికారులు, అప్పటి సబ్ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకుని బదిలీ కూడా చేశారు. అయితే, అధికారి మారినా అక్కడి అవినీతి సంస్కృతి మాత్రం మారలేదు. పాత పద్ధతుల్లోనే దళారులు చక్రం తిప్పుతూ అధికారుల చేతివాటంతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

కార్యాలయంలో జరుగుతున్న ఈ వ్యవహారాలపై వివరణ కోరేందుకు ఓ పత్రిక ప్రతినిధి బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్‌కు ఫోన్ చేయగా, ఆయన స్పందించలేదు. పలుమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం గమనార్హం. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లే కింది స్థాయి సిబ్బంది, దళారులు ఇలా రెచ్చిపోతున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయి విచారణ జరిపి, దళారీ వ్యవస్థను అరికట్టాలని,అవినీతికి పాల్పడుతున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.




