
ఏన్కూరులో ఏపీఎంకు వీఓఏల వినతిపత్రం
హక్కుల కోసం హోరాహోరీ పోరు.. సమ్మె బాటలో VOAలు
సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ – సమ్మెకు సన్నాహాలు వేగం
సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు మే 07 2026: ఏన్కూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర IKP VOA JAC ఆధ్వర్యంలో వీఓఏలు తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు గురువారం మండలంలోని ఏపీఎం కార్యాలయంలో అధికారులకు వీఓఏలు సమ్మె నోటీసుతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వీఓఏ నాయకులు మాట్లాడుతూ, గ్రామీణ పేదల అభివృద్ధి కోసం నిరంతరం సేవలందిస్తున్న వీఓఏలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్నప్పటికీ, ఉద్యోగ భద్రత, సరైన వేతనం, సంక్షేమ సౌకర్యాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
వీఓఏల ప్రధాన డిమాండ్లలో నెలకు ₹20 వేల వేతనం, ప్రత్యేక హెచ్ఆర్ పాలసీ అమలు, సీసీ సదుపాయాల కల్పన, పెండింగ్లో ఉన్న టీఏ బిల్లుల చెల్లింపు, 58 సంవత్సరాల వరకు ఉద్యోగ భద్రత వంటి అంశాలు ఉన్నాయని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మే 18, 2026లోపు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. సమ్మెకు ముందు పలు దశల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లా పీడీలకు వినతిపత్రాలు అందజేయగా, మండల కేంద్రాల్లో ఏపీఎం, ఎంఎస్, వీఓఓబీ అధికారులకు సమ్మె నోటీసులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే మే 9న స్థానిక ఎమ్మెల్యేలను కలిసి సమస్యలను వివరించనున్నట్లు తెలిపారు. మే 13న రాష్ట్రవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రతి వీఓఏ ఉద్యమంలో చురుకుగా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.



