
భద్రాచలంలో గంజాయి విక్రేతలు అరెస్ట్…
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
జూన్ 04,
భద్రాచలం గోదావరి కరకట్ట, రెడ్డి సత్రం సమీప ప్రాంతంలో నిర్వహించిన పెట్రోలింగ్‌లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను భద్రాచలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
డీఎస్పీ అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్‌ఐ పి. శ్యాం ప్రసాద్ సిబ్బందితో కలిసి నిర్వహించిన తనిఖీల్లో వాడపర్తి సురేష్, షేక్ షఫీర్ పాషా ( సప్పు) అనే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా విచారించారు. వారి వద్ద నుంచి సుమారు ఒక కిలో గంజాయి, ఒక మోటార్ సైకిల్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.45 వేలుగా పోలీసులు తెలిపారు.
గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తూ లాభాలు పొందుతున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తల్లి దండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలని డీఎస్పీ సూచించారు.
గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయం, రవాణా, నిల్వపై సమాచారం ఉన్నవారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పోలీసులు పేర్కొన్నారు.




