KhammamPoliticalTelangana

అక్కినాపురం తండాలో చిరుత కలకలం..

అక్కినాపురం తండాలో చిరుత కలకలం..

అక్కినాపురం తండాలో చిరుత కలకలం..

కాలి ముద్రలు, చెట్టు ఎక్కిన ఆనవాళ్లు

CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జులై 02 2026: మండల పరిధిలోని వినోబానగర్ బీట్‌లోని అక్కినాపురం తండా గ్రామ శివారు రాజారావుపేట సెక్షన్‌లో చిరుతపులి సంచరించినట్లు అనుమానాలు వ్యక్తమవడంతో గ్రామస్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. గురువారం ఉదయం అక్కినాపురంతండాకు చెందిన ఓ రైతు తన వ్యవసాయ పొలాన్ని పరిశీలించేందుకు వెళ్లగా, పొలంలో పెద్ద జంతువుకు చెందిన కాలి ముద్రలు కనిపించాయి. వాటిని గమనించిన రైతు వెంటనే గ్రామానికి చేరుకుని స్థానికులకు సమాచారం అందించడంతో పాటు అటవీశాఖ అధికారులకు కూడా సమాచారం ఇచ్చాడు.
సమాచారం అందుకున్న కొత్తగూడెం అటవీ డివిజన్ పరిధిలోని జూలూరుపాడు రేంజ్ ఎఫ్‌ఆర్‌వో తేజస్వి ఆదేశాల మేరకు వినోబానగర్ బీట్ ఆఫీసర్ బి. బాలాజీ గ్రామ పెద్దలు,రైతులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టారు. పొలంలో కనిపించిన కాలి ముద్రలను పరిశీలించిన అధికారులు, సమీపంలోని ఓ చెట్టుపై జంతువు ఎక్కిన ఆనవాళ్లను కూడా గుర్తించారు. ఈ ఆనవాళ్ల ఆధారంగా చిరుతపులి సంచరించి ఉండే అవకాశముందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
అనంతరం అటవీశాఖ అధికారులు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి గ్రామస్థులకు పలు సూచనలు చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో అడవి సమీపంలోని పొలాలకు ఒంటరిగా వెళ్లరాదని, చిన్నారులు, పశువుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా ఎఫ్‌ఆర్‌వో తేజస్వి మాట్లాడుతూ, సంబంధిత ప్రాంతంలో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు. ఎక్కడైనా చిరుత కనిపించినా, కాలి ముద్రలు లేదా ఇతర అనుమానాస్పద ఆనవాళ్లు గుర్తించినా వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. వదంతులను నమ్మకుండా అధికారులకు సహకరించాలని సూచించారు.
చిరుత సంచార సమాచారం నేపథ్యంలో అక్కినాపురం తండా, వినోబానగర్ బీట్ పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండగా, అటవీశాఖ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో గ్రామ పెద్ద ధరావత్ బాబు,మాజీ సర్పంచ్ గుగులోతు ప్రసాద్, స్థానిక రైతులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button