
ఆదిలాబాద్ జిల్లా
గంజాయి రహిత జిల్లానే లక్ష్యం… ప్రతి పోలీసు సిబ్బంది జవాబుదారీతనంతో పనిచేయాలి
ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్‌హెచ్‌ఓ కార్యాలయం ప్రారంభించిన జిల్లా ఎస్పీ
గంజాయి నిర్మూలనలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి నగదు రివార్డులు
శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణపై, రికార్డులు నవీకరణ ప్రత్యేక దృష్టి
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
ఆదిలాబాద్ జిల్లాను పూర్తిస్థాయిలో గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. గంజాయి సాగు, రవాణా, విక్రయాలు, వినియోగంపై రాజీపడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, గంజాయి కేసులను గుర్తించి సమర్థవంతంగా పనిచేసే సిబ్బందిని నగదు రివార్డులతో అభినందిస్తామని తెలిపారు. మంగళవారం ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో నూతనంగా నిర్మించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ శాస్త్రోక్తంగా, వేదమంత్రాల నడుమ ప్రారంభించారు.
అనంతరం ఎస్‌హెచ్‌ఓ కె. నరేష్ కుమార్ చేత పూజా కార్యక్రమాలు నిర్వహించి, అధికారుల సమక్షంలో ఆయనను విధుల కుర్చీలో కూర్చోబెట్టి ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణకు అంకితభావంతో పనిచేయాలని, పోలీస్ స్టేషన్‌ను ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా సేవలందించాలని సూచించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్ పరిశీలించి జిల్లా ఎస్పీ పలు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జవాబుదారీతనం, సమయపాలన, క్రమశిక్షణ, నిజాయితీతో విధులు నిర్వహించాలని, పెండింగ్ కేసులు, వర్టికల్స్ విధానాన్ని అమలు చేస్తూ రికార్డులు లేకుండా ఎప్పటికప్పుడు నవీకరణ చేపట్టాలని ఆదేశించారు. మండల పరిధిలో ఎలాంటి అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అవకాశం ఇవ్వకుండా నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు.
ముఖ్యంగా ప్రతిరోజూ వాహన తనిఖీలు నిర్వహిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, నంబర్ ప్లేట్ లేని వాహనాలు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని స్పష్టం చేశారు. మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న “అరైవ్ అలైవ్” కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని, “కాకి కిడ్స్” కార్యక్రమం ద్వారా విద్యార్థులు, యువత, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని, రోడ్డు ప్రమాదాలను నివారించాలని సూచించారు.
గంజాయి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యంతో పాటు పోలీసు సిబ్బంది చురుకైన పాత్ర పోషించాలని, గంజాయి సాగు, రవాణా, విక్రయాలు, వినియోగంపై సమాచారం సేకరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్వీక్ సాయి కొట్టే ఐపీఎస్, ఇచ్చోడ రూరల్ సీఐ సి.హెచ్. రమేష్, ఇచ్చోడ ఇన్‌స్పెక్టర్ కె. నరేష్ కుమార్, ఎస్సైలు ఈశ్వర్, రామకృష్ణ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




