
పాలకుర్తిలో ఇన్నోవా కారు బీభత్సం.. ఇద్దరి దుర్మ*రణం
పాలకుర్తి,(ck న్యూస్) ప్రతినిధి పల్లె దేవేందర్ గౌడ్ : జనగాం జిల్లా పాలకుర్తి మండలంలో మంగళవారం రాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. వేగంగా దూసుకెళ్లిన ఇన్నోవా కారు రెండు వేర్వేరు ప్రాంతాల్లో పాదచారులను ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
మొదట పాలకుర్తి గుట్ట సమీపంలో ఓ వ్యక్తిని ఇన్నోవా కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన బాధితుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం అదే కారు అక్కడి నుంచి వేగంగా వెళ్లి గూడూరు చౌరస్తా వద్ద మరో వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.
ఘటన అనంతరం కారు వేగంగా పరారయ్యేందుకు ప్రయత్నించగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై వాహనాన్ని వెంబడించారు. బొమ్మేర గ్రామం సమీపంలో ఇన్నోవా కారును పోలీసులు, గ్రామస్థుల సహకారంతో అడ్డగించి పట్టుకున్నట్లు సమాచారం. అయితే కారు డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకుని పరారైనట్లు తెలుస్తోంది.
ఈ ఘటనతో పాలకుర్తి ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.




