
అయోధ్య కానుకల చోరీపై సీబీఐ విచారణ జరపాలి: సీపీఐ
కానుకల చోరీపై బీజేపీ బాధ్యత వహించాలి
తొర్రూరులో సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహణ
తొర్రూర్,(ck న్యూస్) ప్రతినిధి పల్లె దేవేందర్ గౌడ్ : అయోధ్య రామమందిరంలో భక్తులు సమర్పించిన కానుకల చోరీ వ్యవహారంపై వెంటనే సీబీఐ విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, అయోధ్య రామమందిరంలో భక్తుల కానుకల దుర్వినియోగం, చోరీ ఆరోపణలు వెలుగులోకి వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఘటనపై పూర్తి స్థాయి సీబీఐ విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.
దేవాలయాల పవిత్రతకు భంగం కలగొద్దు
హిందుత్వం పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం దేవాలయాల సంపదను రక్షించడంలో విఫలమైందని ఆరోపించారు. ఆలయాల ఆస్తులు, భక్తుల విశ్వాసం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
దేవుడికి చెందిన ఆస్తి దేవుడికే దక్కాలని, ఆలయాల పవిత్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. రామమందిరం అంశంలో జరిగిన పరిణామాలు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, దీనిపై పారదర్శక దర్యాప్తు జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బి. విజయసారథి, మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తమ్మెర విశ్వేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి. అజయ్ సారథి రెడ్డి, నన్ను సుధాకర్ రెడ్డి, కట్టెబోయిన శ్రీనివాస్, ఓం భిక్షపతి, బందు మహేందర్, కిరణ్, లక్ష్మణ్, పెరుగు కుమార్, రేశపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి, కట్లోజు పాండురంగాచారి, వరిపల్లి వెంకన్న, నెల్లూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.




