
నవోదయ 6th క్లాస్ ప్రవేశానికి దరఖాస్తులు ప్రారంభం
నవోదయ విద్యాలయ సమితి (NVS) 2027-28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ (JNVST)-2027 ద్వారా 6వ తరగతిలో ప్రవేశాలకు జూలై 7 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.
షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జూలై 31. ప్రవేశ పరీక్ష నవంబర్ 28న నిర్వహించనున్నారు. ఫలితాలను 2027 మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో ప్రకటించే అవకాశం ఉంది. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి పరీక్షను ముందుగానే నిర్వహిస్తున్నారు.
నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి అర్హతలు 2026-27 విద్యా సంవత్సరంలో గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలి లేదా పూర్తి చేసి ఉండాలి.
అభ్యర్థి ప్రవేశానికి దరఖాస్తు చేస్తున్న జిల్లాకే చెందిన నివాసి అయి ఉండాలి. గుర్తింపు పొందిన పాఠశాలలో 3వ, 4వ, 5వ తరగతులు పూర్తి చేసి ఉండాలి. ఇప్పటికే 5వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు లేదా మళ్లీ 5వ తరగతి చదువుతున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కారు.
వయోపరిమితి
6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసే విద్యార్థి 2015 మే 1 నుంచి 2017 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి.
ప్రవేశ ప్రక్రియలో మార్పులు
ఈ ఏడాది నవోదయ విద్యాలయ సమితి ప్రవేశ విధానంలో కొన్ని మార్పులు చేసింది.
విద్యార్థులు తాము నివసిస్తున్న జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
అయితే విద్యార్థి పక్క జిల్లాలోని పాఠశాలలో చదువుతున్నట్లయితే, ఆ పాఠశాల అతని నివాసానికి 10 కిలోమీటర్ల వైమానిక దూరం (Aerial Distance) పరిధిలో ఉండాలి.
JNVST పరీక్ష విధానం
పరీక్ష వ్యవధి: 2 గంటలు
పరీక్ష సమయం: ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు
మొత్తం 3 విభాగాలు ఉంటాయి.
ప్రశ్నలు ఆబ్జెక్టివ్ (బహుళ ఎంపిక) విధానంలో ఉంటాయి. మొత్తం 80 ప్రశ్నలు, 100 మార్కులు.
మార్కుల విధానం
ప్రతి సరైన సమాధానానికి 1.25 మార్కులు ఇస్తారు.
నెగెటివ్ మార్కింగ్ ఉండదు.
పరీక్షను OMR షీట్ ద్వారా నిర్వహిస్తారు.
నవోదయ విద్యాలయాల్లో రిజర్వేషన్లు
మొత్తం సీట్లలో 75 శాతం గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు రిజర్వ్ చేస్తారు.
మిగిలిన 25 శాతం సీట్లను పట్టణ, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మెరిట్ ఆధారంగా కేటాయిస్తారు.
ప్రతి విద్యార్థికి జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష రాయడానికి ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది.
మొత్తం సీట్లలో మూడింట ఒక వంతు (1/3) సీట్లు బాలికలకు రిజర్వ్ చేయబడ్డాయి.
సామాజిక వర్గాల రిజర్వేషన్ల ప్రకారం:
ఎస్సీ (SC) విద్యార్థులకు కనీసం 15% రిజర్వేషన్
ఎస్టీ (ST) విద్యార్థులకు 7.5% రిజర్వేషన్
ఎస్సీ, ఎస్టీ కలిపి గరిష్ఠంగా 50% వరకు రిజర్వేషన్
ఓబీసీ (OBC) విద్యార్థులకు 27% రిజర్వేషన్ ఉంటుంది.




