
అద్భుత లక్ష్మీ తాయారు తిరునక్షత్ర మహోత్సవం
భక్తి పారవశ్యంలో ఘనంగా నిర్వహణ
108 కలశాభిషేకం.. లక్ష్మీ హోమం.. అన్నప్రసాద వితరణలో పాల్గొన్న భక్తజనం
CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జులై 14 2026: ఏన్కూరు మండలంలోని నాచారం గ్రామం–రేపల్లెవాడ గ్రామాల మధ్య వీరభద్రస్వామి గుట్టపై వెలసిన శ్రీ శ్రీ శ్రీ అద్భుత వెంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో కొలువై ఉన్న శ్రీ అద్భుత లక్ష్మీ తాయారు అమ్మవారి 24వ తిరునక్షత్ర మహోత్సవం మంగళవారం భక్తిశ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, కలశ ఆవాహనం నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం మూలమూర్తికి 108 కలశాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత అమ్మవారికి నూతన వస్త్ర సమర్పణ, విశేష అలంకారం నిర్వహించగా ఆలయ ప్రాంగణం భక్తిమయ వాతావరణంతో కళకళలాడింది.
అనంతరం వేదోక్తంగా లక్ష్మీ హోమం నిర్వహించి లోకక్షేమం, సర్వజన సుఖశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మధ్యాహ్నం మహానైవేద్యం, మంగళాశాసనం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం నిర్వహించిన అన్నప్రసాద వితరణలో చిన్నా, పెద్దా తేడా లేకుండా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడంతో పాటు కుటుంబ సౌఖ్యం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం ప్రసాదించాలని ప్రార్థించారు. ఆలయ అర్చకులు భక్తులకు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ మహోత్సవాన్ని దేవాదాయ శాఖ నిర్వహణ అధికారి ఎస్.వి.డి. ప్రసాద్ పర్యవేక్షించగా, ఆలయ అర్చకులు, సిబ్బంది, సేవా స్వచ్ఛంద కార్యకర్తలు సమన్వయంతో ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు. భక్తుల విశేష ఆదరణ మధ్య శ్రీ అద్భుత లక్ష్మీ తాయారు అమ్మవారి 24వ తిరునక్షత్ర మహోత్సవం విజయవంతంగా ముగిసింది.




