
ఒకే గేటు… ఎన్నో రాకపోకలు..!
గురుకులం గుండా కార్యాలయాల బాట..!
విద్యార్థులకు ఇబ్బందిగా వాహనాల రాకపోకలు
ప్రత్యేక దారి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జూలై 20 2026: ఏన్కూరు మండల కేంద్రంలోని గురుకుల బాలుర పాఠశాల–కళాశాలకు ఉన్న ప్రధాన ప్రవేశ ద్వారమే ప్రస్తుతం ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే మార్గంగా మారింది. దీంతో గురుకుల విద్యార్థులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గురుకుల ప్రధాన గేటు గుండా ఐకేపీ కార్యాలయం, ఉపాధి హామీ పథకం కార్యాలయంలకు అధికారులు, సిబ్బంది, ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ప్రభుత్వ జూనియర్ కళాశాల హాస్టల్‌కు వెళ్లే విద్యార్థులు కూడా ఇదే మార్గాన్ని వినియోగిస్తున్నారు. ఫలితంగా గురుకుల ప్రాంగణం వద్ద రోజంతా వాహనాల రద్దీ నెలకొంటోంది.
విద్యార్థులు తరగతి గదులకు వెళ్లే సమయాల్లోనూ, మధ్యాహ్న విరామ సమయంలోనూ, పాఠశాల ముగిసే వేళల్లోనూ అధికారులు, సిబ్బంది, ఇతరులు ఇదే గేటు గుండా రాకపోకలు సాగించడం వల్ల గురుకుల విద్యార్థులకు అసౌకర్యం కలుగుతోందని చెబుతున్నారు. వాహనాల సంచారం కారణంగా విద్యార్థుల భద్రతపై ఆందోళన నెలకొంది.
ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురుకుల పాఠశాల విద్యార్థుల విద్యాభ్యాసం, క్రమశిక్షణ, భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే విద్యాసంస్థ కావడంతో, ఇతర శాఖల కార్యకలాపాలు కూడా అదే ప్రవేశ ద్వారం ద్వారా సాగడం సరైన విధానం కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
విద్యాసంస్థల ప్రాంగణం ప్రశాంతంగా ఉండాల్సిన సమయంలో నిరంతర రాకపోకలు విద్యా వాతావరణానికి భంగం కలిగిస్తున్నాయని పేర్కొంటున్నారు. అందువల్ల ఐకేపీ కార్యాలయం, ఉపాధి హామీ కార్యాలయం, ప్రభుత్వ జూనియర్ కళాశాల హాస్టల్‌కు వెళ్లే వారి కోసం గురుకుల ప్రధాన గేటుకు బదులుగా ప్రత్యేక ప్రవేశ మార్గాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
దీనివల్ల గురుకుల విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించడంతో పాటు విద్యాసంస్థలో ప్రశాంత వాతావరణం కొనసాగుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యను జిల్లా అధికారులు, గురుకుల విద్యాసంస్థల అధికారులు, సంబంధిత శాఖలు తక్షణమే పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.




